పంజాబ్ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో పేలుడు చోటుచేసుకోవడం కలకలం రేపింది. శనివారం అర్దరాత్రి గోల్డెన్ టెంపుల్‌కు కిలో మీటర్ దూరంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు.
పంజాబ్ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో పేలుడు చోటుచేసుకోవడం కలకలం రేపింది. శనివారం అర్దరాత్రి గోల్డెన్ టెంపుల్‌కు కిలో మీటర్ దూరంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. అయితే పేలుడు జరగడంతో స్థానికులు, భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి జరిగిందేమోనని భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. పేలుడు ఉగ్రదాడి కాదని నిర్దారించారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇక, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. పేలుడు జరిగిన చోట కొంత పౌడర్‌ని స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ నౌనిహాల్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. ఇక, ఈ పేలుడుతో ఆటోరిక్షాలో ఉన్న ఆరుగురు బాలికలకు అద్దాలు తగిలి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘‘అమృత్‌సర్‌లో పేలుళ్లకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని అమృత్‌సర్ పోలీసు కమిషనర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సి ఉందని.. ఏదైనా షేర్ చేయడానికి ముందు వాస్తవాన్ని తనిఖీ చేయాలని ఆయన ప్రజలను కోరారు.
