Asianet News TeluguAsianet News Telugu

కస్టోడియల్ డెత్.. పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టిన స్థానికులు.. బుల్‌డోజర్‌తో ఇళ్లను నేలకూల్చిన అధికారులు

అసోంలో ఘోరం జరిగింది. పోలీసులు ఓ వ్యక్తిని అడ్డుకుని డబ్బులు, బాతు తేవాలని డిమాండ్ చేశారు. కానీ, ఆయన అరేంజ్ చేయలేకపోవడంతో పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అనంతరం ఆయన మరణించినట్టు తెలుస్తున్నది. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. తాజాగా, పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టినట్టుగా అనుమానిస్తున్న వారి ఇళ్లను జిల్లా అధికారులు బుల్‌డోజర్లతో కూల్చేసినట్టు సమాచారం.
 

several houses bulldozed in assam after police station set on fire
Author
Guwahati, First Published May 22, 2022, 4:53 PM IST

న్యూఢిల్లీ: అసోంలో ఓ బిజినెస్‌మ్యాన్ పోలీసు కస్టడీలో మరణించడం విధ్వంసానికి దారి తీసింది. కస్టడీలోనే ఆయన మరణించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆందోళనలు చేశారు. కొందరు ఆందోళనకారులు ఆ పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఫలితంగా పోలీసు స్టేషన్‌లోని కొంత భాగం కాలిపోయింది. ఈ చర్యను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. కాగా, పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టడంలో ప్రమేయం ఉన్న కొందరి ఇళ్లను బుల్డోజర్‌తో అధికారులు నేలమట్టం చేశారు.

అసోం నగావ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బతద్రవా పోలీసు స్టేషన్‌ కు నిప్పు పెట్టినట్టుగా అనుమానిస్తున్న కొందరి ఇళ్లను నగావ్ జిల్లా అధికారులు మే 22న నేలమట్టం చేశారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సలోనిబరి నివాసి సఫికుల్ ఇస్లాం శుక్రవారం రాత్రి శివసాగర్ జిల్లాకు బయల్దేరారు. కానీ, బతద్రబా పోలీసులు ఆయనను మధ్యలోనే అడ్డుకున్నారు. రూ. 10 వేలు, ఒక బాతు కావాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. కానీ, వాటిని పోలీసులకు అరేంజ్ చేయడంలో సఫికుల్ ఇస్లాం విఫలం అయ్యాడు. దీంతో పోలీసులు అతన్ని బతద్రబా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వాటిని అరేంజ్ చేయాల్సిందిగా సఫికుల్ ఇస్లాం కు ఆదేశాలు ఇచ్చారు.

సఫికుల్ ఆయన భార్యకు ఫోన్ చేసి ఒక బాతును, డబ్బును తేవాలని అడిగాడు. ఆమె బాతును తెచ్చింది కానీ, డబ్బును అరేంజ్ చేయలేకపోయింది. దీంతో పోలీసులు సఫికుల్ ఇస్లాంను ఆయన భార్య ముందే కొట్టడం స్టార్ట్ చేసినట్టు కొందరు ఆరోపిస్తున్నారు.

దీంతో ఆమె డబ్బులు అరేంజ్ చేయడానికి మళ్లీ పరుగెత్తింది. ఆమె డబ్బుతో వెనుదిరగడంతో సఫికుల్ ఇస్లాం పోలీసు స్టేషన్‌లో కనిపించలేదు. ఆరా తీయగా.. ఆయనను నగావ్ సివిల్ హాస్పిటల్ తరలించినట్టు పోలీసులు ఆమెకు చెప్పారు.

ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్ వెళ్లగా.. పోస్టుమార్టం గదిలో సఫికుల్ మృతదేహం కనిపించింది.

దీంతో ఆమెకు, కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వారితోపాటు సుమారు వందమంది గ్రామస్తులు ఆ మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి భతద్రబా పోలీసు స్టేషన్‌కు తెచ్చారు. అక్కడే నిరసన చేయడం ప్రారంభించారు. అక్కడే పోలీసులకు మూకగా ఏర్పడ్డ కొందరితో వాగ్వాదం జరిగింది.

ఆ మూకనే పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టింది. ఇందులో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. కనీసం ముగ్గురు దుండగులను అరెస్టు చేసినట్టు ఎస్పీ లీనా డొలీ తెలిపారు. కేసులో దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు. అంతేకాదు, పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణలపైనా దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. దోషులైతే వారిపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టిన నిందితుల ఇళ్లను ఆదివారం బుల్‌డోజర్లతో ధ్వంసం చేశారు. సుమారు 20 మందిని అదుపులోకి తీసుకున్నామని, పోలీసు స్టేషన్ ఇన్‌చార్జీని సస్పెండ్ చేసినట్టు డీఐజీ సత్యరాజ్ హజారికా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios