మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ ట్రక్కు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు.
మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ ట్రక్కు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వారంతా మినీ ట్రక్కులో వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. దతియాలోని దుర్సాదా పోలీస్ స్టేషన్ పరిధిలో బుహ్రా నదిలో ఈ రోజు ఉదయం మినీ ట్రక్కు పడిపోయింది. ఈ ట్రక్కులోని వారు.. గ్వాలియర్ నుంచి తికమ్‌గఢ్‌కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
మినీ ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. బుహ్రా నదిలో ట్రక్కు పడిపోయిందనే సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని ట్రక్కులోని వారిని రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. అదే విధంగా గ్రామస్తులు అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమద సమయంలో వాహనంలో 25 నుంచి 30 మంది వరకు ఉన్నట్టుగా చెబుతున్నారు.
అయితే కొంతమంది వ్యక్తులు ఆచూకీ తెలియడం లేదని.. ఎస్‌డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతుందని స్థానిక అధికారులు తెలిపారు. ఇక, ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
