పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బుధవారం జల్‌పైగురి మల్‌బజార్ వద్ద మల్ నది ఉప్పొంగింది. వరదల కారణంగా ఎనిమిది మంది మరణించారు. ప‌లువురు గ‌ల్లంత‌య్యారు.  

విజయదశమి రోజున పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అప‌శృతి జ‌రిగింది. విజయదశమి సందర్భంగా జల్పాయిగురి జిల్లాలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం చేస్తుండగా.. చూస్తుండగానే కళ్లముందు.. క్షణాల వ్యవధిలో వరదల ఉదృతి పెరిగింది. పదుల సంఖ్యలో జనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఎనిమిది మంది నీట మునిగి మ‌ర‌ణించ‌గా.. ప‌లువురు గల్లంతయ్యారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది

బుధవారం సాయంత్రం నిమజ్జనోత్సవానికి హాజరయ్యేందుకు వందలాది మంది మల్ నది ఒడ్డున గుమిగూడారు. ఈ స‌మ‌యంలో ఆకస్మికంగా వరద రావ‌డంతో ప్రజలు కొట్టుకుపోయారని జల్పైగురి జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోద్రా పిటిఐకి తెలిపారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న సీఎం మమతా బెనర్జి హుటాహుటిన రెస్క్యూ ఫోర్స్‌ను అక్కడికి పంపించి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారనీ, సుమారు 50 మందిని రక్షించామని తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. రాత్రి వేళ కావడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Scroll to load tweet…