ఏడేళ్ల క్రితం చనిపోయిందనుకున్న మహిళ సజీవంగా.. హత్యానేరంలో జైల్లో యువకుడు.. ట్విస్ట్ ఏంటంటే...
ఉత్తర ప్రదేశ్ : ఏడేళ్ల క్రితం చనిపోయిన ఓ మహిళ బతికే ఉంది. దీంతో పోలీసులు ఏడేళ్లనాటి కిడ్నాప్, హత్య కేసును మళ్లీ రీఓపెన్ చేశారు. 14యేళ్ల వయసులో కనిపించకుండా పోయిన ఆమె ఇప్పుడు 40 కి.మీ. దూరంలో ఉన్న హత్రాస్ లో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశాడని నేరస్తుడిగా శిక్ష పడిన ఓ వ్యక్తి ఇంకా జైల్లో మగ్గుతుండడం ఈ కేసులో ట్విస్ట్.
నిందితుడి తల్లి, తన కుమారుడు అమాయకుడని నమ్మింది. అందుకే తానే స్వయంగా ఆ అమ్మాయి గురించి వెతకడం మొదలుపెట్టింది. అలా ఆమె జాడకనిపెట్టింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు హత్రాస్‌కు వెళ్లి, ఇప్పుడు 22 ఏళ్ల వయస్సు ఉన్న యువతిని అలీఘర్‌కు తీసుకువచ్చారు. మేజిస్ట్రేట్ ముందు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు మహిళను తప్పిపోయిన బాలికగా గుర్తించడం కోసం ఆమెనుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తామని పోలీసులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ లో దారుణం...ప్రేమవివాహం చేసుకుందని.. ఉమ్ము నాకించి..
ఈ కేసు 2015 ఫిబ్రవరి 17నాటిది. ఆమె అప్పుడు 10వ తరగతి చదువుతుంది. ఆ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గోండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. “కొన్ని రోజుల తరువాత, ఆగ్రాలో ఒక బాలిక మృతదేహం దొరికింది. బాలిక తండ్రి అక్కడికి వెళ్లి చూసి, మృతదేహం మీదున్న దుస్తులను బట్టి తప్పిపోయిన తన కూతురిదేనని గుర్తించాడు. దీంతో అలీఘర్‌లోని వారింటి పక్కనున్న 18యేళ్ల అబ్బాయిని.. ఆ అమ్మాయి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ తరువాత అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు’’ అని పోలీసులు తెలిపారు.
అరెస్టు చేసినప్పుడు నిందితుడు 18 ఏళ్ల 12వ తరగతి చదువుతున్నాడు. కొన్నాళ్ల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి మళ్లీ జైలుకు పంపారు. దీనిమీద అతని తల్లి మాట్లాడుతూ.. “హత్య కేసులో నా కొడుకు తప్పుగా ఇరికించారని నేను నమ్మాను. అందుకే తప్పిపోయిన అమ్మాయి గురించి వెతకడం ప్రారంభించాను. నాకు కనిపించిన ప్రతొక్కరికీ ఆ అమ్మాయి ఫొటో చూపించాను. ఎక్కడైనా చూశారేమో అడిగేదాన్ని... కొందరు నన్ను సీరియస్‌గా తీసుకున్నారు, కొందరు తీసుకోలేదు. కానీ నేను ఎప్పుడూ ఆగిపోలేదు. దీంతో ఆ ఫొటో వివిధ సర్కిల్‌లలోకి వెళ్లింది”అని నిందితుడి తల్లి చెప్పారు.
అలా “కొన్ని రోజుల క్రితం, బృందావన్‌లో ఒక గురూజీ ప్రసంగిస్తుండగా, అక్కడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన అమ్మాయిని గుర్తించాడు. ఆమె తన కుటుంబంతో హత్రాస్‌లో నివసిస్తున్నట్లుగా తెలుసుకున్నాడు ”అన్నారని అలీఘర్ నివాసి అయిన తల్లి చెప్పింది. "శనివారం, నేను పోలీసుల దగ్గరికి వెళ్లాను. ఆమె ఆచూకీ గురించి వారికి తెలియజేశాను. అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటారని, నా కొడుకు స్వేచ్ఛగా బయటికి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చారామె.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇగ్లాస్), రాఘవేందర్ సింగ్ మాట్లాడుతూ, “అమ్మాయిని సోమవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతి పొందిన తర్వాత, ఆమె గుర్తింపును నిర్ధారించడానికి డీఎన్ఏ ప్రొఫైలింగ్ ను ప్రారంభించాం. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. మహిళ తండ్రి ఆమెను ఇప్పటికే గుర్తించినట్లు కేసుకు సంబంధించిన ఒక అధికారి తెలిపారు.
