అభం శుభం తెలియని ఓ ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిన్నారి తల్లిపై కోపాన్ని పెంచుకున్న అతడు అందుకు పాపం అమాయకురాలిని బలి చేశాడు. అయితే ఈ దారుణం తర్వాత భయాందోళనకు గురైన సదరు యువకుడు కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

పూణేలోని మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజి(సీఎంఈ) క్యాంటిన్ లో ఓ వితంతువు పనిచేస్తోంది. తన ఏడేళ్ళ కూతురితో కలిసి ప్రాంగణంలోని నివాస గృహంలో నివాసముంటోంది. అయితే మంగళవారం ఉదయయం పాపను ఇంట్లో వుంచి  ఆమె పనికి వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి కూతురు రక్తపు మడుగులో విగతజీవిగా పడివుంది. దీంతో చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో చిన్నారిపై అత్యాచారం జరిపి హతమార్చినట్లు తేలింది. 

 పోలీసులు చిన్నారి తల్లి ద్వారా అనుమానితుల వివరాలను సేకరించారు. వితంతువైన ఆమె పనిచేసే హోటల్లోనే ఓ యువకుడు పనిచేసేవాడు.ఇతడు కొద్దిరోజుల క్రితం ఈమెను పెళ్ళిచేసుకుంటానని ప్రతిపాదించాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో సోమవారం కూడా సదరు యువకుడు తనను బెదిరించినట్లు బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. 

దీంతో ఈ యువకుడిని అనుమానితుడిగా భావించిన పోలీసులు  అతడి కోసం గాలింపు చేపట్టారు. అయితే అదే కళాశాల ప్రాంగణంలోని  ఓ చెట్టుకు అతడు  ఉరేసుకుని  మృతిచెందినట్లు గుర్తించారు. యువకుడి మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం  ఆస్పత్రికి తరలించారు.  

ఈ యువకుడే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి  వుంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం భయాందోళను గురై  ఆత్మహత్య చేసుకుని వుంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు....దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.