కర్ణాటకలో ఏడు అద్భుతాలను సీఎం బసవరాజు బొమ్మై ప్రకటించారు. రాష్ట్రంలోని ఎన్నో అద్భుతాల నుంచి ఏడు అద్భుతాలను ఎంపిక చేయడానికి భారీ కసరత్తే జరిగింది.
కర్ణాటకలో ఏడు అద్భుతాలను సీఎం బసవరాజు బొమ్మై ప్రకటించారు. రాష్ట్రంలోని ఎన్నో అద్భుతాల నుంచి ఏడు అద్భుతాలను ఎంపిక చేయడానికి భారీ కసరత్తే జరిగింది. కన్నడ ప్రభ దినపత్రిక, ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఛానల్ కర్ణాటక పర్యాటక శాఖతో కలిసి ‘‘కర్ణాటకలోని ఏడు అద్భుతాలను’’ గుర్తించి ప్రచారం చేసే ఈ మెగా ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. ఆ జాబితాను సీఎం బొమ్మై ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఆ జాబితాలో హిరేబెనకల్ రాతి సమాధులు, హంపి, గోమటేశ్వర, గోల్ గుంబజ్, మైసూర్ ప్యాలెస్, జోగ్ ఫాల్స్, నేత్రాణి ద్వీపం ఉన్నాయి.
ఈ సందర్భంగా బసవరాజు బొమ్మై సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘కర్ణాటకలోని ఏడు అద్భుతాలను’’ రాష్ట్రానికి సరికొత్త పర్యాటక నమూనాను రూపొందించిందన్నారు. ఈ అద్భుతాల జాబితాలో భాగమైన హిరేబెనకల్ కోసం వివరణాత్మక అభివృద్ధి ప్రణాళికను తాను ఇప్పటికే ప్రారంభించానని చెప్పారు. ఈ ప్రదేశాలలో సౌకర్యాలను మెరుగుపరచడానికి.. ఆయా అద్భుతాలు నెలకొన్న జిల్లా కమిషనర్లు బ్లూప్రింట్ అభివృద్ధి నివేదికను సమర్పించాలని కోరారు.కర్ణాటకలోని ఈ ఏడు అద్భుతాలు ఒక సంవత్సరం నిరంతర ప్రయత్నం, కృషి తర్వాత బయటకు వచ్చాయని గుర్తుచేశారు. అదే సమయంలో 5వేల నామినేటెడ్ స్థలాల జాబితాను కూడా ప్రభుత్వానికి అందజేయాలని సీఎం బొమ్మై కోరారు. రాష్ట్ర పర్యాటక ప్రమోషన్ ప్లాన్‌ను రూపొందించడానికి ఈ స్థలాలను బ్లూప్రింట్‌గా ఉపయోగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఒక గొప్ప చొరవకు బీజం వేసినందుకు ప్రాజెక్టు బృందాన్ని సీఎం బొమ్మై అభినందించారు. ప్రాజెక్టు ఇక్కడితో ఆగకుండా వార్షిక కార్యక్రమంగా కొనసాగించాలని కోరారు. ఇలా చేయడం వల్ల విలువైన, అంతగా తెలియని ప్రదేశాలు ఆవిర్భవించే అవకాశం ఉందని అన్నారు. ఇవి కేవలం టూరిజం లొకేషన్లు మాత్రమే కాదని.. మన గొప్ప చరిత్ర, వారసత్వం, సంస్కృతికి సంబంధించిన నిజమైన కథలను తెలియజేయడానికి అద్భుతమైన అవకాశాలు అని పేర్కొన్నారు.
వందలాది అద్భుతాలతో కర్ణాటక దీవించబడింది: రమేష్ అరవింద్
కర్ణాటక వందలాది వింతలతో కళకళలాడుతుందని సెవెన్ వండర్స్ ఆఫ్ కర్ణాటక ప్రాజెక్ట్ అంబాసిడర్, ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ అన్నారు. ‘‘ఈ వందలాది అద్భుతాలలో కేవలం ఏడింటిని ఎన్నుకోవడంలో బాధ్యతాయుతమైన పోస్టు కోసం నన్ను సంప్రదించినప్పుడు.. ఇది గౌరవప్రదమైన పని అని నేను వెంటనే అంగీకరించాను. ప్రతి సంవత్సరం, ప్రపంచ వ్యాప్తంగా వివిధ అందమైన మహిళలు మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరిస్తారు. కానీ ఈ అద్భుతమైన ప్రదేశాలు చాలా సంవత్సరాలుగా అందం కిరీటం ధరించాయి’’ అని రమేష్ అరవింద్ పేర్కొన్నారు.

1. హిరేబెనకల్ రాతి సమాధులు: ఇవి క్రీ.పూ 800 - 200 మధ్య కాలం నాటివి. కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలోని ఈ చరిత్రపూర్వ ప్రదేశం ‘‘మెగా స్టోన్ ఏజ్ వండర్(మహా శిలాయుగం అద్భుతం)’’గా ప్రకటించారు. ఈ సైట్ చాలా మంది స్థానిక కన్నడిగులకు కూడా తెలియదనే చెప్పాలి. కొప్పల్ జిల్లా గంగావతి నుండి 10 కి.మీ ప్రయాణించి హిరేబెనకల్ గ్రామానికి చేరుకోవాలి. ఈ గ్రామంలోని మోర్యారా కొండపై, వందలాది మానవ నిర్మిత చరిత్రపూర్వక రాతి సమాధులు, గుహ చిత్రాలు ఆసక్తికరమైన సందర్శకులను స్వాగతిస్తాయి. యూకేలోని స్టోన్‌హెంజ్, ఈజిప్ట్ పిరమిడ్‌లు, బహ్రెయిన్‌లోని దిల్మున్ శ్మశానవాటికలను ఈ ప్రాంతం గుర్తుచేస్తుంది.

2. హంపి: 14-16వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన హంపి.. విజయనగర సామ్రాజ్యం అద్భుతమైన పాలనకు ఉదాహరణగా నిలుస్తుంది. నేటి విజయనగర జిల్లాలో ఉన్న హంపిని ‘‘ఆర్కిటెక్చరల్ అద్భుతం’’గా ప్రకటించారు. రోమ్ లాగానే హంపి నగరం మొత్తం ఒక అద్భుతం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్-ఎయిర్ ఆర్కియోలాజికల్ మ్యూజియంలలో ఒకటి. దీని నిర్మాణ వైభవం, శిల్పకళా వైవిధ్యం, స్మారక చిహ్నాల సంఖ్య ఇవన్నీ ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. హంపి రాతి రథం ఈ చారిత్రక ప్రదేశంలో హైలైట్‌గా నిలుస్తుంది. హంపిలోని రాళ్లు మధురమైన రాగం పాడతాయనేది నమ్మకం. అది వాస్తవం కూడా.

3. గోమటేశ్వర: 57 అడుగుల ఎత్తైన గోమఠేశ్వర విగ్రహాన్ని 10వ శతాబ్దంలో హాసన్ జిల్లా శ్రావణబెళగొళలోని వింధ్యగిరి కొండపై నిర్మించారు. దీనిని ‘‘తాత్త్విక అద్భుతం’’గా ప్రకటించారు. గోమటేశ్వర విగ్రహం కర్ణాటకలోని అగ్ర విగ్రహాలలో ఒకటి.

4. గోల్ గుంబజ్: 17వ శతాబ్దంలో అప్పటి బీజాపూర్ (ప్రస్తుతం విజయపుర)లో సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఈ భారీ గోపురాన్ని నిర్మించారు. భారీ గోల్ గుంబజ్‌ను ‘ఆర్కిటెక్చరల్ సైన్స్ వండర్’గా ప్రకటించారు. తాజ్ మహల్ ప్రపంచంలోని వైట్ వండర్ అయితే.. కర్ణాటక గోల్ గుంబజ్‌ను ప్రపంచంలోని డార్క్ వండర్ అని పిలుస్తారు.

5. మైసూర్ ప్యాలెస్: 19-20వ శతాబ్దంలో వడయార్ రాజవంశం నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాత అంబా విలాస ప్యాలెస్‌ను ‘‘రాయల్ హెరిటేజ్ వండర్’’గా ప్రకటించారు. మైసూర్‌లోని ఈ ప్యాలెస్ భారతదేశంలోని అత్యంత అందమైన ప్యాలెస్‌లలో ఒకటి. ఈ ప్యాలెస్ మైసూర్ రాష్ట్ర అద్భుతమైన గతానికి అద్దమైన ప్రతిబింబంగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

6. జోగ్ ఫాల్స్: భారతదేశంలోని అత్యంత అందమైన జలపాతాలలో ఒకటిగా జోగ్ జలపాతం పరిగణించబడుతుంది. షిమోగా జిల్లాలోని జోగ్ ఫాల్స్‌లో 830 అడుగుల ఎత్తు నుండి నీరు కిందకు పడుతుంది. ఈ ప్రపంచ ప్రఖ్యాత విజువల్ ట్రీట్‌ను ‘‘నేచురల్ వండర్ ఆన్ ల్యాండ్ (భూమిపై సహజ అద్భుతం)’’గా ప్రకటించారు. ముఖ్యంగా వర్షాకాలంలో జోగ్ జలపాతం నిండుదనంతో చూడదగిన దృశ్యంగా ఉంటుంది.

7. నేత్రాణి ద్వీపం: ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర్ సమీపంలో అరేబియా సముద్రం మధ్యలోప్రేమకు ప్రతీకగా హృదయాకారంలో ఉండే నేత్రాణి ద్వీపాన్ని ‘‘నేచురల్ వండర్ ఆన్ ల్యాండ్ (నీటిపై సహజ అద్భుతం)’’గా ప్రకటించారు. ఈ ద్వీపం చాలా సుందరమైనది. సముద్ర జీవులతో సమృద్ధిగా ఉంది. ఇది స్కూబా డైవింగ్ కార్యకలాపాలలో దేశంలోనే రెండోవదిగా రేట్ చేయబడింది.
