ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 27 మందికి గాయాలయ్యాయి.
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉత్తరకాశీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 27 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు వున్నారు. గంగోత్రి నుంచి వస్తుండగా గంగనమి వద్ద ఈ ప్రమాదం సంభవించింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గుజరాత్‌కు చెందినవారిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ విపత్తు స్పందన దళాలు , వైద్య సిబ్బందికి అక్కడికి చేరుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.
