పెళ్లి బస్సు బోల్తా పడిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన దారుణ ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో జరిగింది. ఆదివారం ఉదయం 11:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  పెళ్లి బృందం బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 

దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని పెళ్లి కూతురు ఇంటి నుంచి వరుడు, బంధుమిత్రులు సుమారు 60 మంది ఒక ప్రైవేటు బస్సులో కొడగు జిల్లాలోని వరుని ఇంటికి బయల్దేరారు. మధ్యలో కేరళలోని కాసరగోడ్‌ జిల్లా పాణత్తూర్‌ మీదుగా ప్రయాణిస్తుండగా డ్రైవర్‌ అదుపుతప్పాడు. దీంతో బస్సు రోడ్డు పక్కనున్న ఒక పెంకుటిల్లుని ఢీకొట్టింది. దీంతో బస్సు వేగంగా బోల్తా కొట్టింది. 

ఈ ఘటనలో బస్సులోని 60 మందిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన తరువాత మరో ఇద్దరు చనిపోయారు. గాయపడినవారిని కాసరగోడ్‌ ఆస్పత్రికి తరలించారు. 

మృతులందరూ కొడగు జిల్లాకు చెందినవారేనని తెలిసింది. మృతులు రాజేశ్, రవిచంద్ర, ఆదర్శ్, శ్రేయస్, సుమతి, శశి, జయలక్ష్మీ. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు.  ఈ దుర్ఘటనపై కేరళ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేయాలని ఆదేశించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.