కర్ణాటకలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీకి షాక్ తగిలింది.

కర్ణాటకలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీకి చెందిన లింగాయత్ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవికి అత్యంత సన్నిహితుడైన హెచ్‌డీ తమ్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం హెచ్‌డీ తమ్మయ్య, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తమ్మయ్యను, ఆయన అనుచరులను హస్తం పార్టీలోకి స్వాగతించారు. తమ్మయ్య ఎటువంటి అంచనాలు లేకుండా పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని అనుకుంటున్నారని.. అయితే తాను పేర్లను వెల్లడించడం లేదని శివకుమార్ పేర్కొన్నారు.


‘‘చాలా మంది బీజేపీ నాయకులు నన్ను స్వచ్ఛందంగా కలిశారు. చిక్కమగళూరులో మార్పు రావాలని కోరుకున్నారు. 12-13 మంది సభ్యులు టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సెకండ్‌హ్యాండ్ నేతలందరినీ అడ్మిట్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.. వారు పెద్ద నాయకులను చూస్తున్నారు.. మేము బూత్ స్థాయిలో పనిచేసే నాయకుల కోసం చూస్తున్నాం’’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు.

ఇక, హెచ్‌డీ తమ్మయ్య బీజేపీలో చాలా కాలంగా కొనసాగుతున్నారు. కర్ణాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్ కోరుకున్నారు. అయితే బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయన.. హస్తం పార్టీలో చేరారు. 

‘‘నేను 2007 నుండి బిజెపిలో పని చేస్తున్నాను. వివిధ పదవులలో నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు నన్ను నిరాశపరిచాయి. ఫలితంగా నేను జిల్లా యూనిట్ కన్వీనర్ పోస్టుకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకుంటున్నాను. బీజేపీలో 17 సంవత్సరాలుగా నా పనిలో నాకు సహకరించిన పార్టీలోని అన్ని బోర్డులు, ఫోరమ్‌లు, యూనిట్ల ఆఫీస్ బేరర్లు, అధిపతుల, సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కార్యకర్త సహచరులు, సీనియర్ నాయకులందరికీ ధన్యవాదాలు’’ అని తమ్మయ్య రాజీనామా లేఖలో పేర్కొన్నారు.