Asianet News TeluguAsianet News Telugu

రెస్టారెంట్‌లలో సర్వీస్ చార్జీ తప్పనిసరి కాదు.. కచ్చితంగా కట్టాల్సిందేనని బలవంతం చేయరాదు: కేంద్రం

రెస్టారెంట్లలో ఒక్కోసారి సర్వీస్ చార్జీలు చూస్తే దిమ్మదిరిగిపోతుంటుంది. ఆ సర్వీస్ చార్జీలను కూడా తప్పకుండా చెల్లించాల్సిందేనని రెస్టారెంట్లు పేర్కొంటూ ఉంటాయి. కానీ, ఈ చార్జీలు చెల్లించడం తప్పనిసరి కాదని కేంద్రం తెలిపింది. రెస్టారెంట్లు కూడా వాటిని వసూలు చేయరాదని స్పష్టం చేసింది.

service charges are not mandatory in restaurants says centre
Author
New Delhi, First Published May 23, 2022, 7:52 PM IST

న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి సర్వీస్ చార్జీ కచ్చితంగా కట్టాల్సిందేనని రెస్టారెంట్లు వసూలు చేయరాదు. ఒక వేళ సర్వీస్ చార్జీ తీసుకున్నా.. అవి కస్టమర్లు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలని చట్టం చెబుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు రెస్టారెంట్లకు ఓ సున్నితమైన హెచ్చరిక చేసింది. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ హెచ్చరిక చేసింది. ఈ ఫిర్యాదులను నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)కు పంపింది. 

కొన్ని రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి సర్వీస్ చార్జీ పేరిట వసూళ్లు చేపడుతున్నాయని, ఒక్కోసారి సర్వీస్ చార్జీ మరీ దారుణంగా ఎక్కువగా ఉంటున్నాయని ఆ లేఖ పేర్కొంది. ఇలాంటి చార్జీల చట్టబద్ధతపైనా రెస్టారెంట్లు వినియోగదారులను తప్పదారి పట్టిస్తున్నాయని వివరించింది. అంతేకాదు, బిల్ అమౌంట్ నుంచి ఈ సర్వీస్ చార్జీ తొలగించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేసినా రెస్టారెంట్లు వేధించిన ఘటనలు ఉన్నట్టు ఆ లేఖ పేర్కొంది.

వినియోగదారుల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో వినియోగదారుల ఈ హక్కుల ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉన్నదని భావిస్టున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ రాసిన లేఖ వివరించింది.

ఈ నేపథ్యంలోనే ఎన్ఆర్ఐఏతో జూన్ 2న సమావేశం కావడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసింది. రెస్టారెంట్లు విధిస్తున్న సర్వీస్ చార్జీలపై ఆ సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్చించనుంది. సర్వీస్ చార్జీ చెల్లించడం అనేది స్వచ్ఛందమైన నిర్ణయం అని కస్టమర్లకు తెలుపకుండా తొక్కిపట్టే విషయంపై ఈ భేటీలో చర్చకు రానుంది.

హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలకు సంబంధించి వినియోగదారుల వ్యవహారాల శాఖ 2017 ఏప్రిల్ 21న గైడ్‌లైన్స్ ప్రచురించినట్టు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios