కరోనాపై ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు భారత్‌లోనూ నిలిచిపోయాయి. డీసీజీఐ నోటీసులు ఇవ్వడంతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

వచ్చే వారంలో భారత్‌లో ఈ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ మొదలుకావాల్సి వుంది. కరోనా వ్యాక్సిన్ రేసులో తొలి నుంచి ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్.. ప్రయోగాల కోసం భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో జత కట్టింది.

అయితే క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆక్స్‌ఫర్డ్ నిర్ణయించింది. ప్రామాణిక నిబంధనల ప్రకారం.. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలపై సమీక్ష నిర్వహిస్తామని ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది.

అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంపై సీరమ్ ఇన్స్‌టిట్యూట్‌కు డీసీజీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్ ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీరమ్ ప్రకటించింది.