ప్రపంచం యావత్తూ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వైపే చూస్తుంది. రెండు, మూడు వారాల్లో అందుబాటులోకి రానుందన్న వార్తలు అందరిలోనూ ఆశలు రేకెత్తిస్తోంది. ఆల్రెడీ యూకేలో మొట్ట మొదటి వ్యాక్సిన్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో టీకా రేటు ఎంత ఉంటుందో అనే దానిమీద అందరిలోనూ సందేహాలున్నాయి. 

భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నా కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతోంది. ఇతర దేశాల్లో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే టైంలో రకరకాల కోవిడ్ వ్యాక్సిన్‌ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి. తమకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో... ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించాయి. అయితే, ఏ వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందోననే టెన్షన్ కూడా సామాన్యుల్లో ఉంది. ఇక, సీరం ఇన్‌స్టిట్యూట్.. టీకాల తయారీలో దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థ. ఉత్పత్తి సామార్థ్యం పరంగా కూడా ప్రపంచంలోనే అతి పెద్ద టీకా తయారీదారుగా చెబుతారు. 

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్‌ అవసరాలు తీర్చేందుకు సీరం అనువైనదిగా నిపుణుల అభిప్రాయంగా ఉంది. కేంద్రం కూడా సీరం‌ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో సీరం కోవిడ్ వ్యాక్సిన్‌పై కీలక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది.. కరోనా టీకాను కేవలం రూ. 250కే అందిస్తామంటూ ఆ ఇన్‌స్టిట్యూట్ కేంద్రానికి ప్రదిపాదన పంపినట్టుగా సమాచారం. 

కాగా, ఆక్సఫర్డ్ టీకా ధర రూ. వెయ్యి వరకు ఉండొచ్చని గతంలో సీరం సీఈవో ప్రకటనచేశారు.. కానీ, వ్యాక్సిన్‌ కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో వాటి ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, సీరం మాత్రం ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.