ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకాతో కలిసి సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా టీకా ప్రయోగ పరీక్షపై దుమారం చెలరేగింది. ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ వల్ల తన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడిందని క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వాలంటీర్ ఆరోపించగా.. వాటిని సీరం సంస్థ ఖండించింది. కాగా.. తమ టీకాపై ఆరోపణలు చేసిన వాలంటీర్ పై రూ.100కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఈ ఆరోపణలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేపట్టింది.

చెన్నైకి చెందిన 40ఏళ్ల బిజినెస్ కన్సల్టెంట్ తరపున ఈ నెల 21న ఆయా సంస్థలకు నోటీసులు పంపారు. అందులోని అంశాల ప్రకారం... కోవిషీల్డ్ పై సీరం సంస్థ నిర్వహిస్తున్న మూడో దశ క్లినికల్ ప్రయోగాల్లో బాధితుడు పాల్గొన్నాడు. అక్టోబర్ 1న అతనికి శ్రీరామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలో టీకా వేశారు. మొదటి పది రోజులు అతనికి ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ ఆ తర్వాత తీవ్ర తలనొప్పి, వాంతులు వంటి కావడం మొదలయ్యాయి.

చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితికి అతడు వచ్చాడు. దీంతో అక్టోబర్ 11న అతనిని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. మాట్లాడలేని, ఎవరినీ గుర్తించలేని స్థితికి జారిపోయాడు. కుటుంబసభ్యుల కోరిక మేరకు గత నెల 26న అతనిని డిశ్చార్జ్ చేశారు.

అతని మెదడు పూర్తిగా దెబ్బతిన్నది.  అతనికి టీ కా కారణంగానే అతనికి అలా అయ్యిందని తేలడం గమనార్హం. బాధితుడు అనారోగ్యం బారిన పడి నెల రోజులు గడుస్తున్నా ఎవరూ అతనిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్  సురక్షితం కాదనే ప్రచారం మొదలైంది. తనకు రూ.5కోట్లు నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు కుటుంబసభ్యులు సదరు వ్యాక్సిన్ సంస్థకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ విషయం తీవ్ర దుమారం రేపింది.

బాధితుడిలో తలెత్తిన ఆరోగ్య సమస్యలకు కోవిషీల్డ్ టీకాతో ఏదైనా సంబంధం ఉందా లేదాఅన్న విషయం నిర్థారించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా , వ్యాక్సిన్ ప్రయోగం జరిగిన చోటు ఉన్న సంస్థాగత నైతిక విలువల కమిటీ దర్యాప్తు చేపట్టాయి.

ఇదిలా ఉండగా.. తమ టీకా వల్ల తీవ్ర దుష్ర్పభావాలు తలెత్తినట్లు వచ్చిన ఆరోపణలు సీరం సంస్థ ఖండించింది. దురుద్దేశంతో ఈ ఆరోపణలు చేస్తున్నారు. తాము రూ.100కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించడం గమనార్హం.