భోపాల్: మధ్యప్రదేశ్ లో ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ పోలీసుల చేతికి చిక్కాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని మండిదీప్‌లో ఆదేశ్ ఖామ్రా అనే సీరియల్ కిల్లర్ విచిత్రంగా పోలీసులకు చిక్కాడు. మరో 9 మంది ముఠా సభ్యులను కూడా పోలీసులు పట్టుకున్నారు. 

అమాయకంగా పగలు కుట్టు మిషను మీద పని చేసుకుంటూ పోతుంటాడు. అందరి దృష్టిలో మంచివాడు, మర్యాదస్తుడు, కష్టపడి పనిచేసేవాడు. కానీ రాత్రి అయిందంటే అతనిలో రాక్షసుడు నిద్ర లేస్తాడు. లారీ డ్రైవర్లను, వారివెంట ఉండే క్లీనర్లను అతను చంపేసి వారి వద్ద ఉన్నదంతా దోచుకున్నాడు. 2010 నుంచి అతను 33 హత్యలు చేశాడు.

డ్రైవర్లను, క్లీనర్లను చంపిన తర్వాత మృతదేహాలను కాలువల్లోనో, కొండల మీదనో పారేస్తాడు. శవాల మీద దుస్తులు తీసేస్తాడు. గుర్తు పట్టకుండా ముఖాలను నలగ్గొడతాడు. గతవారం అనుకోకుండా ఓ మహిళా పోలీసు అడవిలో మూడురోజులు వెంటాడి అతన్ని పట్టుకున్నారు. 

మామూలు నేరస్థుడనుకుని పట్టుకున్న పోలీసులు అతడో సీరియల్ కిల్లర్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.  30 హత్యలు చేసినట్లు తొలుత అంగీకరించిన ఆదేశ్ ఖమ్రామరో మూడు హత్యలు చేసినట్టు మంగళవారం అంగీకరించాడు. 

ఆదేశ్ తన అనుచరులతో కలిసి ఆ హత్యలు చేశాడు. వారిలో 9 మంది దొరికారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లతో స్నేహం నటించి మందు తాగబోసి ఆ తర్వాత చంపేస్తారు. వారివద్ద ఉన్న డబ్బులు, ఇతర వస్తువులు తీసుకుని శవాలను పారేస్తారు.  

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, బీహార్‌లలో శవాలు దొరికాయి.  డ్రైవర్లకు తాను ముక్తిని ప్రసాదించానని ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా అతను పకపక నవ్వుతూ చెప్పాడు.