వేర్పాటువాద నేత, హురియత్ లీడర్ యాసిన్ మాలిక్ జైలులో శుక్రవారం ఆమరణ నిరాహాదీక్షకు కూర్చున్నారు. తన కేసు విచారణ సరైన రీతిలో సాగడం లేదని ఆరోపిస్తూ ఆయన నిరసనకు దిగారు.
న్యూఢిల్లీ: హురియత్ లీడర్, వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ శుక్రవారం ఉదయం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఢిల్లీలోని తిహార్ జైలులో ఆయన ఈ నిరసనకు దిగాడు. ఆయన కేసును సరైన రీతిలో దర్యాప్తు చేయడం లేదని పేర్కొంటూ ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నాడు.
తిహార్ జైలు నెంబర్ 7లో శుక్రవారం ఉదయం నుంచి ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. జైలు ఉన్నత అధికారులు ఆయనతో మాట్లాడారు. వెంటనే తన నిరసన మార్గాన్ని వదిలిపెట్టాలని సూచించారు. కానీ, ఆయన నిరాకరించారు.
మన దేశ న్యాయస్థానాల్లో ఆయనపై న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ.. తన దర్యాప్తు తీరు మారే వరకు లేదా మరణించే వారకు నిరాహార దీక్ష చేస్తానని చెప్పినట్టు యాసిన్ మాలిక్ కుటుంబ సభ్యులు శుక్రవారం మీడియాకు వివరించారు.
2019 ఏప్రిల్ నెలలో జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సంస్థ చీఫ్ యాసిన్ మాలిక్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓ టెర్రర్ ఫైండింగ్ కేసులో అరెస్టు చేసింది. మరికొందరు వేర్పాటువాదులనూ ఎన్ఐఏ అరెస్టు చేసింది.
కాగా, ఏడాది తర్వాత మార్చి 2020లో మాలిక్, మరో ఆరుగురు ఈయన అనుచరులకు టాడా, ఆయుధాల చట్టం కింద అరెస్టు చేశారు. జనవరి 25, 1990.. 40 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని రావల్పొరాలో చంపేయాలని చూశారని అభియోగాలు నమోదయ్యాయి.
మే 25వ తేదీన ఆయనకు ఢిల్లీ కోర్టు ఉపా కింద జీవిత కారాగార శిక్ష విధించింది.
