ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు 

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సంస్థలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా డిబ్రూగఢ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అమృత్‌పాల్ డిబ్రూగఢ్‌కు తరలించినట్లు పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ తెలిపారు. 

ఇందుకోసం డిబ్రూగఢ్ సెంట్రల్ జైలు వద్ద బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. జైలు కాంపౌండ్‌ను అస్సాం పోలీసు శాఖలోని ఎలైట్ బ్లాక్ క్యాట్ కమాండోలు, సీఆర్‌పీఎఫ్, జైలు భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జైలు లోపల కూడా భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. విమానాశ్రయం నుంచి డిబ్రూగఢ్ జైలు వరకు 15 కి.మీ దూరం వరకు రోడ్డు క్లియరెన్స్ కోసం స్థానిక ట్రాఫిక్ పోలీసులను సైతం అప్రమత్తం చేశారు. 

35 రోజులుగా ఆపరేషన్‌

గత 35 రోజులుగా అమృతపాల్ సింగ్‌ను పట్టుకోవడానికి ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఈరోజు పక్కా సమాచారం సేకరించి మొత్తం ఆపరేషన్ చేపట్టారనీ, చట్ట ప్రకారం.. తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలా పేరుతో గురుద్వారా సాహిబ్‌ను నిర్మిస్తున్నారనే ప్రశ్నకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. శాంతిభద్రతలు కాపాడాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు ఫేక్ న్యూస్‌లను షేర్ చేయవద్దని ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని పోలీసులు స్పష్టం చేశారు.

ఆదివారం ఉదయం 6:45 గంటలకు రోడా గ్రామం నుంచి పట్టుబడ్డాడు. పంజాబ్ పోలీసులు , ఇంటెలిజెన్స్‌కు అతను రోడా గ్రామంలో ఉన్నాడని ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ కారణంగా గ్రామం అన్ని వైపుల నుండి చుట్టుముట్టబడింది. అయితే అమృతపాల్ సింగ్ గురుద్వారా సాహిబ్‌లో దాక్కున్నాడు. గురుద్వారా సాహిబ్ గౌరవాన్ని పోలీసులు చూసుకున్నారు.

ALso Read: ఎవ‌రీ అమృత్ పాల్ సింగ్? ఎందుకు అరెస్టు చేశారు? ఆయ‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌లు ఏంటి..?

అన్ని వైపుల నుండి దిగ్బంధనం కారణంగా.. అమృతపాల్ సింగ్ తప్పించుకోవడానికి మార్గం లేదు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం అమృతపాల్ సింగ్‌ను భటిండా విమానాశ్రయం నుంచి విమానంలో అసోంలోని దిబ్రూఘర్ జైలుకు తీసుకువెళుతున్నారు. పంజాబ్ పోలీసులు అతనిపై గత 35 రోజులుగా ఒత్తిడి పెంచారు. మొత్తం ఆపరేషన్ సమయంలో శాంతిని కాపాడినందుకు పంజాబ్ ప్రజలకు ఐజిపి కృతజ్ఞతలు తెలిపారు.