ఉద్యోగాల కుంభకోణంలో అవినీతి కేసులో అరెస్టయిన మంత్రి వి సెంథిల్ బాలాజీని రాష్ట్ర మంత్రివర్గం నుండి తొలగించడంతో అధికార పార్టీ డిఎంకె , ప్రతిపక్ష బిజెపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  

ఉద్యోగాల కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మంత్రి వి సెంథిల్ బాలాజీని రాష్ట్ర మంత్రివర్గం నుండి రాష్ట్ర గవర్నర్ తొలగించారు. దీంతో అధికార పార్టీ డిఎంకె , ప్రతిపక్ష బిజెపి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. జైలులో ఉన్న సెంథిల్ బాలాజీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంత్రిగా కొనసాగించారు. కానీ గవర్నర్ ఆర్.ఎన్.రవి ఏకపక్ష చర్యతో ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. 

మంత్రి వి సెంథిల్ బాలాజీ ఉద్యోగాల కోసం డబ్బు తీసుకోవడం, మనీలాండరింగ్ వంటి అనేక అవినీతి కేసుల్లో తీవ్రమైన క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఎదుర్కొంటున్నారు. మంత్రి సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీని జూలై 12 వరకు పొడిగిస్తూ చెన్నై సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ అల్లి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సెంథిల్ బాలాజీని తమిళనాడు రాష్ట్ర మంత్రి మండలి నుంచి గవర్నర్ ఆర్.ఎన్.రవి తొలగించారు. రాజకీయ లబ్ది కోసం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నరని డిఎంకే ఆరోపించగా.. సెంథిల్ బాలాజీని తొలగించడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. గవర్నర్ నైతిక,చట్టపరమైన నిర్ణయం తీసుకున్నారని బిజెపి పేర్కొంది. ఆర్ఎన్ రవి నిర్ణయంతో గవర్నర్, డీఎంకే మధ్య విభేదాలు మరింత పెరిగాయి.

ఈ పరిణామంపై తమిళనాడు న్యాయ శాఖ మంత్రి ఎస్ రేఘుపతి మాట్లాడుతూ.. "ఇది ప్రజాస్వామ్యమా? లేదా నియంతృత్వ దేశమా? మంత్రిని తొలగించే అధికారాలు గవర్నర్‌కు లేవు. సిఎం సిఫారసుల మేరకు మాత్రమే గవర్నర్ చర్య తీసుకోగలరు. ఈ సమస్యను రాజకీయంగా,చట్టపరంగా సవాలు చేశాం." అని అన్నారు

గవర్నర్ నాటకీయ చర్యపై ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. మంత్రివర్గం నుంచి మంత్రిని తొలగించే అధికారం గవర్నర్ కు లేదని, గవర్నర్ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాలు చేస్తామని అన్నారు. గవర్నర్ చర్య బిజెపియేతర ప్రతిపక్ష పార్టీలలో ఆగ్రహాన్ని కూడా రేకెత్తించింది. ఈ తొలగింపును ఖండించాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమనీ, ఈ చర్య ప్రజాస్వామ్య కూనీ అని పేర్కొన్నాయి పార్టీ వర్గాలు.

బీజేపీ ఎలా స్పందించింది?

ఈ అంశంపై బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ..గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి అనీ, మంత్రిని బర్తరఫ్ చేసే హక్కు గవర్నర్‌కు ఉందని అన్నారు. సెంథిల్ బాలాజీని గవర్నర్ నియమించారు. ఆయనను ఎందుకు డిస్మిస్ చేశారో గవర్నర్ కారణాలు చెప్పారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయలేదనీ, దీంతో గవర్నర్ నైతిక, న్యాయపరమైన నిర్ణయం తీసుకున్నారనినారాయణన్ తిరుపతి అన్నారు.

ఉత్తర్వుల నిలిపివేత..

అయితే కేంద్రం సలహా మేరకు గవర్నర్ తన తొలగింపు ఉత్తర్వులను పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారని గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై అటార్నీ జనరల్‌ను సంప్రదిస్తున్నారని, నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి సెంథిల్ బాలాజీ మంత్రిగా కొనసాగుతారని వారు తెలిపారు. బాలాజీ అరెస్టు (జూన్ 14న) తర్వాత .. ప్రభుత్వం ఆయనను మంత్రిగా పోర్ట్‌ఫోలియో లేకుండా కొనసాగించింది. అతని అధీనంలో ఉన్న శాఖలను ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు (విద్యుత్), గృహనిర్మాణ శాఖ మంత్రి ముత్తుసామి (ఎక్సైజ్)లకు కేటాయించారు. మంత్రి బాలాజీ ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ కింద ఆయనపై ఉన్న మరికొన్ని క్రిమినల్ కేసులను రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలాజీ అరెస్టు

ఉద్యోగాల కోసం నగదు కేసులో బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జూన్ 14న అరెస్టు చేసింది. ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తర్వాత జూన్ 15న సెంథిల్ బాలాజీని మద్రాస్ హైకోర్టు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. ఆ ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనా, హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అదే సమయంలో సెంథిల్ తన పదవిని దుర్వినియోగం చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నాడని రాజ్ భవన్ పేర్కొంది. అతడు తన మంత్రి పదవిని దుర్వినియోగం చేస్తూ విచారణకు అడ్డుతగులుతూ న్యాయ, న్యాయ ప్రక్రియను అడ్డుకుంటున్నారని తెలిపింది. 

వి సెంథిల్ బాలాజీని మంత్రి మండలిలో కొనసాగించడం న్యాయమైన విచారణతో సహా న్యాయ ప్రక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే భయాలు ఉన్నాయని, ఇది రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి దారితీస్తుందని రాజ్ భవన్ ప్రకటన పేర్కొంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ సెంథిల్ బాలాజీని తక్షణమే మంత్రి మండలి నుంచి తొలగించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు.. బాలాజీని మంత్రివర్గం నుంచి తప్పించాలంటూ మే 31న గవర్నర్ ముఖ్యమంత్రికి లేఖ పంపగా, ఆ మరుసటి రోజే స్టాలిన్ సవివరంగా సమాధానం ఇచ్చారు.