కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయం ధరించిన వారు అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించి దుమారం రేపారు.

భోపాల్‌లో మంగళవారం జరిగిన ‘‘సంత్ సమాగమ్’’లో పాల్గొన్న డిగ్గీరాజా సాధువులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాషాయ వస్త్రాలు ధరించిన వారు అత్యాచారాలు చేస్తున్నారని.. అవి దేవాలయాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.

సనాతన ధర్మం ఎంతో ప్రాచీనమైనదని.. దానిని పరిరక్షించడానికి బదులు కొంతమంది కాషాయం వేసుకుని చూర్ణాలు అమ్ముకుంటున్నారని దిగ్విజయ్ ఆరోపించారు.హిందూ మతానికి అపఖ్యాతి తెచ్చే పనులు చేస్తుంటే భగవంతుడు సైతం క్షమించడని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లో స్వామి చిన్మయానంద్ మీద ఓ లా విద్యార్ధి ఆరోపణలు చేయగా.. దీనిని ఉద్దేశించే దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. అయితే డిగ్గీ రాజా వ్యాఖ్యలపై పలువురు సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు.