కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నుంచి బీజేపీ, భజ్‌రంగ్ దళ్.. డబ్బులు తీసుకున్నాయంటూ ఆరోపించారు.

దీనిపై అందరూ దృష్టి సారించాలని కోరారు.. ముస్లింల కంటే ముస్లిమేతరులు ఐఎస్ఐకి గూఢచారులుగా వ్యవహరిస్తున్నారంటూ డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు. ఈ విషయం అందరికీ అర్ధం కావాల్సి వుందంటూ దిగ్విజయ్ తెలిపారు.

కాశ్మీర్ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.. రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

రాహుల్ వంటి నేత మనకు ఉండటం దురదృష్టకరమని.. ఆయనకు భారత్ కంటే పాక్ అంటేనే ప్రేమ ఎక్కువగా ఉందని ఇరానీ మండిపడిన సంగతి తెలిసిందే. మరి దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ, భజ్‌రంగ్‌ దళ్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.