న్యూఢిల్లీ: కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొందుతూ ఆయన గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు అహ్మద్ పటేల్ తుదిశ్వాస విడిచారని ఆయన తనయుడు పైసల్ పటేల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన వయస్సు 71 ఏళ్లు

ఆహ్మద్ పటేల్ కు నెల రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. గత కొద్ది రోజులుగా శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

 

ఆహ్మద్ పటేల్ ఎనిమిది సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మూడు సార్లు లోకసభకు, ఐదుసార్లు రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు.  అహ్మద్ పటేల్ కాంగ్రెసు కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఆయన కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది.

అహ్మద్ పటేల్ మృతికి పలు వైపుల నుంచి సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ఎఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సంఘ్వీ ట్వీట్ చేశారు. అహ్మద్ పటేల్ మృతి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ప్రతి రోజు పైసల్ తో మాట్లాడుతూ వచ్చానని ఆయన చెప్పారు. భయంకరమైన వార్త అని ఆయన అహ్మద్ పటేల్ మృతిపై వ్యాఖ్యానించారు. 

అహ్మద్ పటేల్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు.