Asianet News TeluguAsianet News Telugu

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం.. సెంగోల్ తయారుచేసిన కుటుంబానికి ఆహ్వానం.. వారి రియాక్షన్ ఏమిటంటే..

భారత కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున సెంగోల్ (రాజదండం) కూడా ప్రతిష్టించనున్నారు. ఇప్పటివరకు అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచబడిన సెంగోల్‌ను.. కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయడానికి తాజాగా ఢిల్లీకి తరలించారు.

Sengol Maker Jeweller Family From Tamil Nadu gets Invitation for new parliament inauguration ksm
Author
First Published May 26, 2023, 5:23 PM IST

భారత కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున సెంగోల్ (రాజదండం) కూడా ప్రతిష్టించనున్నారు. ఇప్పటివరకు అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచబడిన సెంగోల్‌ను.. కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయడానికి తాజాగా ఢిల్లీకి తరలించారు. అయితే చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకున్న సెంగోల్‌ను తయారుచేసిన తమిళనాడులోని ఉమ్మిడి బంగారు చెట్టి కుటుంబానికి కూడా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. అయితే దీనిపై వారు హర్షం వ్యక్తం చేశారు. 

95 ఏళ్ల ఉమ్మిడి ఈతిరాజు మాట్లాడుతూ.. తాను గర్వపడటమే కాకుండా ఉప్పొంగిపోతున్నానని చెప్పారు. సెంగోల్ తయారుచేసిన సమయంలో తనకు 20 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. తిరువడుతురై అథీనం సహకారంతో ఇతరులతో కలిసి సెంగోల్ తయారుచేసినట్టుగా చెప్పారు. తమది సాధారణ స్వర్ణకారుల కుటుంబమని.. ప్రస్తుతం తాము ఎంతగానో గర్వపడుతున్నామని చెప్పారు. ఈ మేరకు ఎన్డీటీవీ రిపోర్టు చేసింది.

ఇక, నివేదికల ప్రకారం..  భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటిష్ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ త్వరలో ప్రధానమంత్రి కాబోతున్న జవహర్‌లాల్ నెహ్రూను బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతదేశానికి అధికార బదిలీని ఎలా సూచిస్తారని అడిగారు. దీంతో దేశం చివరి గవర్నర్ జనరల్ అయిన సి రాజగోపాలాచారి సలహాను నెహ్రూ కోరారు. నెహ్రూకు రాజగోపాలాచారి  ప్రధాన పూజారి కొత్త రాజు అధికారంలోకి వచ్చినప్పుడు రాజదండం అప్పగించే తమిళ సంప్రదాయం గురించి చెప్పారు. ఈ సంప్రదాయం చోళుల పాలనలో అనుసరించబడిందని.. భారతదేశం స్వాతంత్ర్యం గుర్తుగా దీనిని ఉపయోగించవచ్చని రాజగోపాలాచారి సూచించారు.

భారతదేశ స్వాతంత్ర్యాని గుర్తుగా రాజదండాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్న రాజగోపాలాచారి తమిళనాడులోని పురాతన శైవ మఠాలలో ఒకటైన తిరువడుతురై అథీనంను సంప్రదించారు. వారు ఆ బాధ్యతను స్వీకరించి.. అప్పటి మద్రాసులో నగల వ్యాపారి అయిన ఉమ్మిడి బంగారు చెట్టికి రాజదండం తయారు చేయమని అప్పగించారు. ఇప్పుడు అనేక దశాబ్దాల తరువాత ఉమ్మడి బంగారు చెట్టి వారసులకు కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానం అందింది. 

ఇక, ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. లోక్‌సభ స్పీకర్ సీటు పక్కన 'సెంగోల్'ని ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. లోక్‌సభ స్పీకర్ సీటు పక్కన 'సెంగోల్'ని ఏర్పాటు చేయనున్నారు. 

ఇదిలా ఉంటే.. సెంగోల్ ఇటీవలి వరకు అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచబడింది. ఇది తాజాగా కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయడానికి ఢిల్లీకి తరలించబడింది. ‘‘మేము భారతదేశంలోని దాదాపు అన్ని మ్యూజియంలకు లేఖలు రాశాం. మాకు దాదాపు ఒక సంవత్సరం నుంచి సమాధానం రాలేదు. కానీ మేము అలహాబాద్ మ్యూజియంకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నాము. మూడు నాలుగు నెలల తర్వాత మాకు సమాధానం వచ్చింది. మ్యూజియంలో మేము వివరించిన దానికి సమానమైనదేదో ఉంది. దండాన్ని చూసిన వెంటనే అది సెంగోల్ అని మాకు తెలుసు.. ఎందుకంటే దానిపై తమిళంలో అది ఏమిటో, దేనికి ఉపయోగించబడిందో వివరించే శాసనాలు ఉన్నాయి’’ అని ఉమ్ముడి బంగారు జ్యువెలర్స్ మేనేజింగ్ పార్టనర్ అమరేంద్రన్ ఉమ్ముడి అన్నారు. సి రాజగోపాలాచారికి  సంప్రదాయాలపై లోతైన అవగాహనతో సెంగోల్ తయారీలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. 

ఇక, తమిళనాడుకు చెందిన 20 మంది ‘‘అథీనం’’ (మఠం) పెద్దల నుంచి సెంగోల్‌ను ప్రధాని మోదీ స్వీకరించనున్నారు. ఈ వేడుకకు దాదాపు 25 పార్టీలు హాజరుకానుండగా.. కాంగ్రెస్‌తో సహా కనీసం 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios