పశ్చిమ బెంగాల్: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. అభిమాన నటులు కనిపించినా, సరికొత్త ప్లేస్ లకు వెళ్లినా ఏదైనా వెరైటీ స్టంట్స్ చేసినా ముందు సెల్ఫీలు తీసుకోవడం పొరపాటుగా మారిపోయింది. 

అభిమాన నటులు ప్రత్యక్షంగా కనబడుతుండటంతో వారితో సెల్ఫీ దిగేందుకు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇస్తే ఒక గొడవ, ఇవ్వకపోతే మరో గొడవ. దీంతో తలలు పట్టుకుంటున్నారు నటులు. తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి నస్రత్ జహాన్ కు. 

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జార్‌గ్రామ్ నుంచి తృణముల్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న బీర్బాహ సోరేన్‌కు మద్దతుగా బుధవారం నస్రత్ జహాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ గ్రామ్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఇంతలో సెల్ఫీల కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేజ్ పైకి రావడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

దీంతో అంతా ఒక్కసారిగి భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇకపోతే నస్రత్ జహాన్ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బసిర్హట్ లోక్ సభ నుంచి పోటీ చేస్తున్నారు.