జంట హత్యల కేసుతో పాటు ఇతర నేరాల్లో వివాదాస్పద గురువు బాబా రాంపాల్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. హిస్సార్‌లోని బాబా రాంపాల్‌ ఆశ్రమంలో బాబా, ఆయన అనుచరుల నిర్బంధంలో ఉన్న తమ భార్యలు దారుణంగా చంపబడ్డారని ఢిల్లీకి చెందిన శివపాల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్‌లు ఫిర్యాదు చేశారు.

2014లో ఆయనపై నమోదైన రెండు కేసుల్లో విచారణకు హాజరవ్వాల్సిందిగా న్యాయస్థానం ఎన్ని సార్లు నోటీసు పంపినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో.. న్యాయమూర్తి ‌ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీనిలో భాగంగా రాంపాల్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై బాబా అనుచరులు దాడికి పాల్పడ్డారు..

నాడు జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు మహిళలు, ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు కేసుల్లోని హత్య కేసులో బాబా రాంపాల్‌ను దోషిగా నిర్థారించిన హిసార్‌లోని సెషన్స్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీనితో పాటు రాంపాల్‌ అతని అనుచరులపై నమోదైన దేశద్రోహం, హత్య వంటి ఐదు కేసులు హిసార్ కోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. తీర్పు సందర్భంగా హిసార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.