కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నవారు చాలా మందే ఉన్నారు.  కాగా.. 50సంవత్సరాలు పైబడినవారు, ఆ వయసులోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కోవిడ్ వ్యాక్సిన్ ని  పొందడానికి నేరుగా ఆన్ లైన్ లో తమ సమాచారాన్ని నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది.

ఎవరికి వారే తమ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుచుకోవచ్చు. ఇప్పటికే ప్రవేశపెట్టిన ‘కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్(కొవిన్)’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా అర్హులు ఈ టీకాను పొందడానికి అవకాశం లభిస్తుంది.

అయితే.. ఈ యాప్ ను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. దీని ద్వారానే కోవిడ్ టీకాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. మరో 7-10 రోజుల్లో కోవిన్ యాప్ సాధారణ ప్రజలకూ అందుబాుటలోకి రానుందని ప్రజారోగ్య సంచాలకుడు, రాష్ట్ర కోవిడ్ టీకాల ఇన్ ఛార్జి డాక్టర్ జి. శ్రీనివాసరావు వెల్లడించారు.

జనవరి రెండో వారంలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. కోవిడ్ టీకాల కార్యక్రమంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వరసగా సమావేశాలు నిర్వహించనుంది. ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ చేపట్టాల్సిన కార్యచరణను క్షున్నంగా పరిశీలిస్తున్నారు. ప్రతి అంశంలోనూ నిపుణులు మార్గనిర్దేశం చేస్తున్నారు. యాప్ ని ఎలా వినియోగించాలి.? టీకాలను నిల్వ చేయడం తదితర అంశాలపై మార్గనిర్దేశం చేశారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఏ వ్యాధికి కూడా ఇంత త్వరగా టీకాను తీసుకురాలేదు. కోవిడ్ నుంచి ప్రజలను రక్షించడానికి జరిగిన కృషిలో భాగంగా అతి వేగంగా ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. అత్యవసర వినియోగం కోసం మాత్రమే ఇప్పుడు అనుమతులు ఇస్తున్నారు. ప్రయోగ ఫలితాలన్నీ పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

వచ్చే రెండు వారాల్లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టీకాకు సుమారు 9-12 నెలల వరకూ రక్షణ ఉంటుంది. రెండో డోసు కూడా వేసుకున్న తర్వాతే పూర్తి రక్షణ లభిస్తుంది. రెండో డోసును కొన్ని టీకాలకు 3వారాలు, మరికొన్నింటికి 4 వారాలకు పొందాల్సి ఉంటుంది. ఏ తరహా టీకా మనకు అందుబాటులోకి వస్తుందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కాగా.. టీకా వచ్చినా మాస్క్ లు ధరించాల్సిందేనని అధికారులు చెప్పారు.