దేశ ద్రోహ చట్టం రద్దు చేయాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమా కోరేగావ్ కమిషన్ కు గురువారం లేఖ రాశారు. ఈ చట్టం అనేక సార్లు దుర్వినియోగానికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ భీమా కోరేగావ్ కమిషన్‌కు లేఖ రాశారు. ఇందులో సెక్షన్ 124 ఏ (విద్రోహ చట్టం)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసమ్మతి గొంతులను అణచివేయడానికి ప్రభుత్వాలు దీనిని దుర్వినియోగం చేస్తున్నాయ‌ని అన్నారు. దీంతో పాటు అల్లర్లు వంటి పరిస్థితులను నియంత్రించడానికి, నిరోధించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు, మేజిస్ట్రేట్లకు అధికారం ఇవ్వడం కోసం సీఆర్ పీసీ, ఐపీసీలో కూడా ఆయ‌న సవరణలను ప్రతిపాదించారు.

భీమా కోరేగావ్ కమిషన్ కు స‌మ‌ర్పించిన త‌న అఫిడవిట్ లో శ‌ర‌ద్ ప‌వార్ ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. 1870 సంవ‌త్స‌రంలో బ్రిటిషర్లు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటులను నియంత్రించడానికి, స్వాతంత్ర ఉద్యమాలను అణచివేయడానికి రాజద్రోహానికి సంబంధించిన ఐపీసీలో సెక్షన్ 124 ఏ ను చేర్చారని చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో తమ స్వేచ్ఛను అణిచివేస్తోందని విమర్శించే వ్యక్తులపై ప్రభుత్వం ఈ సెక్ష‌న్ విధిస్తోంద‌ని, ఇది తరచుగా దుర్వినియోగం అవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శాంతియుత, ప్రజాస్వామ్య మార్గంలో అసమ్మతి స్వరాన్ని అణిచివేసేందుకు ఇది ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలిపారు. అందుకే ఐపీసీలోని సెక్షన్ 124 ఏ దుర్వినియోగాన్ని సవరణలతో ఆపాలని లేదా ఆ సెక్షన్ ను ర‌ద్దు చేయాల‌ని సూచించారు. జాతీయ సమగ్రతను కాపాడటానికి ఐపీసీ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) నిబంధనలు సరిపోతాయ‌ని తెలిపారు. అందుకే తాను ఈ ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

సీఆర్పీసీతో పాటు, అల్లర్లు వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి, ప్రజాశాంతికి విఘాతం కలగకుండా ఉండటానికి ఇతర చట్టాలకు సవరణలు అవసరమని పవార్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు, మేజిస్ట్రేట్లు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే మహారాష్ట్రలోని తన సంకీర్ణ ప్రభుత్వం అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలపై అదే చట్టం కింద కేసు నమోదు చేసిన కొద్ది రోజులకే రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని ఎన్సీపీ చీఫ్ ప్రతిపాదించడం ఆస‌క్తిక‌రంగా మారింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠించడానికి ప్రయత్నించిన ఈ జంటను ఇటీవల అరెస్టు చేశారు.