Karnataka: కర్నాటకలోని శివమొగ్గలో భజరంగ్‌దళ్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఆంక్షలు విధించారు. ఈ హత్యకు.. హిజాబ్ గొడవకు సంబంధం లేదని పోలీసులు తెలిపారు.
Karnataka: కర్నాటకలో ఇప్పటికే హిజాబ్ వివాదం (hijab row) అక్కడి పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చింది. ఇలాంటి పరిణామాలు నెలకొని సమయంలో భజరంగ్ దళ్ (Bajrang Dal activist) కార్యకర్త, 26 సంవత్సరాల వయస్సు ఉన్న హర్ష అనే వ్యక్తి ఆదివారం నాడు శివమొగ్గ (Shivamogga)లో హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ హత్య క్రమంలో సోమవారం నిషేధాజ్ఞలు విధించారు.
వివరాల్లోకెళ్తే.. ఆదివారం అర్థరాత్రి శివమొగ్గ (Shivamogga)లో రైట్‌వింగ్ కార్యకర్త 26 ఏళ్ల హర్ష హత్యకు గురయ్యాడు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు 144 సెక్షన్ విధించినట్టు శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ సెల్వమణి ఆర్ తెలిపారు. “మొత్తం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు స్థానిక పోలీసులు, RAF ని మోహరించాం” అని వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా నగర (Shivamogga) పరిధిలోని పాఠశాలలు, కళాశాలలను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి, సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సీనియర్ పోలీసు, జిల్లా అధికారులతో కూడా మంత్రి జ్ఞానేంద్ర (Araga Jnanendra) సమావేశమయ్యారు. "మాకు ఇప్పటికే క్లూ వచ్చింది, కానీ దర్యాప్తు జరుగుతున్నందున నేను ఎక్కువ పంచుకోలేను. సంతృప్తికరమైన అంశం ఏమిటంటే, ఎవరు చేశారో మాకు తెలుసు. వారు త్వరలో పట్టుకుంటారు. దాదాపు నలుగురైదుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ కేసు ద్వారా మేం గట్టి సందేశం ఇస్తాం’’ అని తెలిపారు. భజరంగ్ దళ్ కు చెందిన యువకుడిని ముస్లిం గూండాలు హత్య చేశారని శివమొగ్గకు చెందిన బీజేపీ నాయకుడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప అన్నారు. “పరిస్థితిని విశ్లేషించడానికి నేను ఇప్పుడు శివమొగ్గ వెళ్తున్నాను. మేము 'గూండాయిజాన్ని' అనుమతించము”అని ఆయన అన్నారు.
ఈ ఘటనపై హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. “ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. హోంమంత్రి, సీఎం (బసవరాజ్ బొమ్మై-Chief minister Basavaraj Bommai) వచ్చే జిల్లాలోనే ఇది జరిగింది. దోషిని ఉరి తీయాలి. హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను' అని ఆయన అన్నారు. ఇదిలావుండగా, పట్టణంలోని సీగేహట్టి ప్రాంతంలో కొంతమంది దుండగులు అనేక వాహనాలను తగులబెట్టారు . ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి.
విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై వివాదం చెలరేగడంతో గత కొన్ని రోజులుగా కర్నాటక (Karnataka) లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల రైట్‌వింగ్ కు చెందిన యువకులు కాషాయ ఖండువాలు ధరించగా.. ముస్లిం యువతులు హిజాబ్ ధరించే హక్కుపై గళమెత్తారు. అయితే ఈ హత్యకు హిజాబ్ గొడవకు సంబంధం లేదని పోలీసులు తెలిపారు. రైట్ వింగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాలపై ర్యాలీ తీశారు. ఈ క్రమంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
