దశాబ్దాల న్యాయపోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 5న ప్రారంభించనున్నారు. రామమందిర భూమి పూజను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, వీఐపీలు హాజరవుతున్న నేపథ్యంలో భూమి పూజకు రెండు రోజుల ముందు, ఆ రోజు అయోధ్యలో చేపట్టబోయే భద్రతా చర్యలపై నగర డీఐజీ దీపక్‌కుమార్ మాట్లాడారు.

ప్రోటోకాల్‌ను అనుసరించడంతో పాటు కోవిడ్ వారియర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. వీఐపీలు వచ్చే రూట్లను డ్రోన్ల సాయంతో నిరంతరం పర్యవేక్షిస్తామని.. నగరంలోని ప్రజలకు ఎలాంటి పరిమితులు విధించలేదని, కరోనాను దృష్టిలో వుంచుకుని బయటకు రావొద్దని డీఐజీ ప్రజలను కోరారు.

బయటి వ్యక్తులను నగరంలోకి అనుమతించమని.. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా చర్యలు చేపడుతున్నట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన, 45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని మాత్రమే ప్రధానికి సెక్యూరిటీగా ఉంచనున్నట్లు తెలిపారు.

నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ వేడుకను నిర్వహిస్తోంది. భూమి పూజ కార్యక్రమం అనంతరం రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.