Punjab: పంజాబ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న భగ్వంత్ మాన్ ఆ రాష్ట్ర పోలీస్ డీజీపీ వీకే భావ్రాను కలిసిన కొద్ది గంటలకే 122 మంది రాజకీయవేత్తల భద్రతపై వేటు పడింది. వీరికి కల్పించిన భద్రతను ఉపసంహరించాలని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) రాష్ట్రంలోని ఎస్ఎస్‌పీలు, సీపీలకు ఒక లేఖలో ఆదేశాలు జారీ చేశారు. వీరిలో కాంగ్రెస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
Punjab: ఆప్ నేత భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్ డీజీపీ వీకే భావ్రాతో భేటీ అయి.. భద్రతా ఆంశాలపై చర్చించారు. సమావేశం పూర్తి అయిన కొద్ది గంటలకే 122 మంది రాజకీయవేత్తల భద్రతపై వేటు పడింది. మాజీ మంత్రులకు, ప్రముఖ నేతలకు కల్పించిన భద్రతను ఉపసంహరించాలని పంజాబ్ పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) రాష్ట్రంలోని ఎస్ఎస్‌పీలు, సీపీలకు లేఖ రాశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
గత ప్రభుత్వంలో చాలా మంది నేతలకు భద్రత కల్పించిన విషయం తెలిసిందే.. భద్రతాను కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ సీనియర్ నేతలే ఉన్నారు. భద్రత కోల్పోతున్న వారి జాబితాలో కేబినెట్ మాజీ మంత్రులు, అసెంబ్లీ మాజీ స్పీకర్ ఉన్నారు. మాజీ మంత్రులు మన్‌ప్రీత్ సింగ్ బాదల్, రాజ్ కుమార్ వెర్కా, భరత్ భూషణ్ అషు, బ్రహ్మ్ మోహింద్రా, సంగత్ సింగ్ గిల్జియాన్, రణ్‌దీప్ సింగ్ నభా, విధానసభ మాజీ డిప్యూటీ స్పీకర్ అజైబ్ సింగ్ భట్టి, మాజీ స్పీకర్ కెపి సింగ్, రజియా సుల్తానా తదితరులు తమ భద్రతను కోల్పోనున్నారు.
అలాగే ఈ జాబితాలో ప్రముఖ నేతలు, మాజీ ఎమ్మెల్యే, పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ భార్య పేరు కూడా ఇందులో ఉంది. ఆమెకు కల్పించిన భద్రతా సిబ్బంది నుంచి ఏడుగురిని ఉపసంహరించనున్నారు. బటిండా అర్బన్ స్థానం నుంచి ఓడిపోయిన బాదల్‌కు 19 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తుండగా, వారిలో 16 మంది అషుకు రక్షణ కల్పిస్తున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నేతలు-- పర్గత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, రాణా గుర్జీత్ సింగ్, ట్రిప్ట్ రాజేందర్ సింగ్ బజ్వా, సుఖ్‌బిందర్ సర్కారియా , బరీందర్మీత్ సింగ్ పహ్రా కూడా భద్రతాను కోల్పోతున్నారు. అలాగే.. దల్జీత్ సింగ్ చీమా, తోట సింగ్, సికందర్ సింగ్ మలుకా, చున్నీ లాల్ భాగ, మనోరంజన్ కాలియా, అనిల్ జోషి, దినేష్ బాబు ఆదేశ్ పర్తాప్ సింగ్ కైరోన్, మాజీ ఎమ్మెల్యేలు శరంజిత్ ధిల్లాన్ వంటి బిజెపి, శిరోమణి అకాలీదళ్ నాయకులు తమ భద్రతను కోల్పోతారు. ఈ జాబితాలో ఆప్ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆప్ మాజీ ఎమ్మెల్యే జగ్తార్ సింగ్ జగ్గా, కన్వర్ సంధు, అమర్‌జిత్ సింగ్ సండోవా, హెచ్‌ఎస్ ఫూల్కా పేర్లు కూడా ఉండటం గమనార్హం.
అలాగే.. లోక్ ఇన్సాఫ్ పార్టీ బెయిన్స్ సోదరులు -- సిమర్జీత్ బెయిన్స్ మరియు బల్విందర్ బెయిన్స్ కూడా తమ భద్రతను కోల్పోతారు. ఇంకా, ఈ జాబితాలో శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ లాంగోవాల్ పేరు కూడా ఉంది. కోర్టు ఆదేశాల మేరకు మోహరించిన భద్రతా సిబ్బంది అలాగే ఉంటారని, భద్రత ఉపసంహరణకు ముందు .. రక్షణ సంబంధించిన ముప్పు ఏదైనా ఉంటే.. పంజాబ్ ADGP/సెక్యూరిటీ కి ఫిర్యాదు చేయవచ్చనని లేఖలో పేర్కొన్నారు.
