బీజేపీ విధానాలను వ్యతిరేకించే లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. మతతత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని సూచించారు. 

భారతీయ జనతా పార్టీ (bjp)ని ఒంట‌రి చేసి, ఓడించేందుకు అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (sitaram yechury) పిలుపునిచ్చారు. బుధ‌వారం కేర‌ళ‌ (kerala) లోని కన్నూర్‌ (kannur)లో సీపీఐ(ఎం) 23వ పార్టీ మహాసభలను ఏచూరి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రత్యామ్నాయ కార్యక్రమం ఆధారంగా మతతత్వానికి వ్యతిరేకంగా అన్ని లౌకిక శక్తులతో కూడిన విశాలమైన ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. 

“ మేము ఈ దిశలో ఎలా ముందుకు వెళతామో పార్టీ చర్చిస్తుంది. బీజేపీని ఒంటరి చేసి ఓడించేందుకు అన్ని లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఏకతాటిపైకి రావాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తోంది. లౌకికవాదాన్ని ప్రకటించే అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశభక్తి కర్తవ్యాన్ని నిర్వర్తించే సందర్భానికి పుంజుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలు తమ సభలను క్రమబద్ధీకరించాలి. భారత రిపబ్లిక్ లో ముఖ్య‌మైన లౌకిక, ప్రజాస్వామ్య లక్షణాన్ని కాపాడటానికి వారు ఎక్కడ నిలబడతారో నిర్ణయించుకోవాలి” అని ఏచూరి అన్నారు.

ఏచూరి తన ప్రసంగంలో కేంద్రంలోని బీజేపీపై విధానాల‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఆ పార్టీ పాలన నయా ఉదారవాద విధానాలను కేరళ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంద‌ని అన్నారు. “ కేరళలోని సీపీఐ(ఎం) ప్రభుత్వం లౌకికవాదాన్ని రాజీ లేకుండా నిలబెట్టడం ద్వారా మ‌న పోరాటానికి మార్గాన్ని చూపింది. కుల, లింగ భేదం లేకుండా సమానత్వాన్ని గౌరవిస్తూ, అదే సమయంలో నయా ఉదారవాద ఎజెండాకు ప్రత్యామ్నాయంగా ప్రజానుకూల విధానాలను అమలు చేయాలని కోరుతున్నారు’’ అని అన్నారు.

“ ఫలితాలు అందరూ చూడగలిగేలా ఉన్నాయి. నేడు ప్రపంచం కేరళ ఉన్నత స్థాయి మానవాభివృద్ధి సూచికలను ప్రశంసిస్తోంది. లౌకికవాదాన్ని సమర్థించడం, సమానత్వాన్ని గౌరవించడం, ప్రజా అనుకూల విధాన ప్రత్యామ్నాయం అనే ఈ సూత్రాల ఆధారంగా ఈ విజయం సాధించగలిగింది. ” అని సీతారం ఏచూరి అన్నారు. సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని, దాని రాజకీయ జోక్యాలను గణనీయంగా పెంచేందుకు, వామపక్ష శక్తుల ఐక్యతను బలోపేతం చేసేందుకు, వర్గ, సామూహిక పోరాటాలకు పదును పెట్టేందుకు నిర్దిష్టమైన చర్యలను పార్టీ చర్చిస్తుందని ఆయ‌న అన్నారు. 

ఐదు రోజుల పార్టీ నిర్వ‌హిస్తున్న స‌మావేశాలు వ‌చ్చే మూడేళ్లలో సీపీఐ (ఎం) పార్టీ రాజ‌కీయ దిశ‌ను నిర్దేశించ‌నుంది. ముఖ్యంగా 2024 లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో ఎలాంటి వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు అవల‌భించాలి వంటి అంశాల‌పై దిశా నిర్దేశం జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశంలో ఇతర కీలక అంశాలపై చర్చను నిర్వహిస్తారు.