బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా ప్రస్తుతం అక్కడ మరణ మృదంగం మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యూకే నుంచి పలువురు భారత్‌లోకి రావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

కర్ణాటక ప్రభుత్వం సైతం చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారు. దానితో పాటు 144 సెక్షన్‌ విధించాలని పోలీసులు నిర్ణయించారు.

డిసెంబర్‌ 24 నుంచి జనవరి 1వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో బెంగళూరులో భారీగా పోలీసులను మోహరించారు.

ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు బెంగళూరు నగర పోలీస్ కమీషనర్. కారణం లేకుండా ఎవరైనా రోడ్ల మీదకు వస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.

ప్రజారవాణా, నిత్యావసర వస్తువుల రవాణా వాహనాలు, విమానాశ్రయాలకు వెళ్లే టాక్సీలకు మాత్రమే అనుమతి వుందన్నారు. మెడికల్‌ షాప్‌లు మినహా ఇతర దుకాణాలు, వాణిజ్య సముదాయాలను రాత్రి 11 గంటలకల్లా మూసివేయాలని కమీషనర్ ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు, ఫ్లై ఓవర్‌ వంతెనలపై పెట్రోలింగ్‌ నిర్వహించాలని అధికారులకు సూచించారు.

రాత్రి 11 గంటల తర్వాత అత్యవసర సర్వీసులు మినహా మిగతా వేటికీ అనుమతి ఉండదు. ఈ కర్ఫ్యూ అమలులో ఉన్నంత వరకు 50 శాతం సామర్థ్యంతో పనిచేసే కంపెనీలు, పరిశ్రమల్లో రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తారు. దూర ప్రాంతాలకు బస్సులు, రైళ్లు, విమానాల్లో వెళ్లే ప్రయాణికులకు ఎట్టి పరిస్ధితుల్లోనూ అనుమతి లేదన్నారు.

కాగా, కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. దీనిపై కర్ణాటక ఆరోగ్యమంత్రి కె.సుధాకర్‌ మాట్లాడుతూ.. కరోనాపై ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

ముందస్తు చర్యల్లో భాగంగా రాత్రి 8 గంటల నుంచే నైట్ కర్ఫ్యూ విధించాలని కమిటీ సూచించిందని చెప్పారు. అయితే చర్చల అనంతరం దానిని రాత్రి ఎనిమిది నుంచి కాకుండా 11 గంటలకు మార్చినట్లు సుధాకర్ తెలిపారు.