Bengal: బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహిస్తున్న బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడి ర్యాలీకి ముందు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.
Suvendhu Adhikari arrest: అధికార పార్టీ నాయకుల అవినీతికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్‌కు మంగళవారం మధ్యాహ్నం బీజేపీ చేపట్టిన పాదయాత్ర ప్రారంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్ భారతీయ జనతా పార్టీ నాయకుడు సువేందు అధికారిని సచివాలయం చేరకుండా అడ్డుకున్న పోలీసులు ఆయనను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.
సువేందు అధికారి, బీజేపీ లోక్‌సభ సభ్యుడు, లాకెట్ ఛటర్జీ నేతృత్వంలోని ర్యాలీ కోల్‌కతా నుండి పక్కనే ఉన్న హౌరా జిల్లాలోని మందిర్తలాకు కలిపే రెండవ హుగ్లీ వంతెనగా ప్రసిద్ధి చెందిన విద్యాసాగర్ బ్రిడ్జికి ప్రవేశం వద్ద భారీ పోలీసు బందోబస్తు అడ్డుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు సచివాలయ ముట్టడికి ముందుకు సాగారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు సువేందు అధికారి, లాకెట్ ఛటర్జీ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలు వ్యాన్‌లోకి ఎక్కించారు.
అయితే, ర్యాలీని అడ్డుకోవడానికి, తనను ముందుకు సాగకుండా మహిళా పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా, ఉద్దేశపూర్వకంగా నియమించారని సువేందు అధికారి ఆరోపించారు. తనను జైలు వ్యాన్‌లో ఎక్కించేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసులపై అధికారి కేకలు వేయడం కూడా కనిపించింది. "నువ్వు మహిళవు.. నా శరీరాన్ని ముట్టుకోవద్దు" అని అధికారి అరుపులు వినిపించాయి. తర్వాత సువేందు అధికారి,లాకెట్ ఛటర్జీ ఇద్దరినీ సెంట్రల్ కోల్‌కతాలోని లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. ప్రతిపక్ష నాయకుడితో ఇలా ప్రవర్తించడం దారుణమని పేర్కొన్నారు.
కాగా, బీజేపీ ర్యాలీ చేపట్టిన రోజే.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలలో మూడు రోజుల అధికారిక పర్యటన కోసం కోల్‌కతా నుండి బయలుదేరి వెళ్లారు. కోల్‌కతాకు దూరంగా ఉండాలనే ఆమె నిర్ణయాన్ని ఎత్తిచూపిన బీజేపీ నాయకులు.. తమ ర్యాలీని ఆపడానికి ముఖ్యమంత్రి మొత్తం పోలీసులను నియమించారనీ, ఆమె కోల్‌కతా నుండి పారిపోవడం ద్వారా ఈ పని చేసిందని విమర్శించారు. ఇదిలావుండగా, బీజేపీ పై తృణమూల్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీకి పెద్దగా బలం లేదని అర్థం చేసుకుని ప్రతిపక్ష నేత ఇలాంటి నాటకాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి & పురపాలక శాఖ మంత్రి, కోల్ కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ అన్నారు. "బీజేపీలో నాయకులు మాత్రమే ఉన్నారు. కార్యకర్తలు లేరు. కాబట్టి, కార్యకర్తలు లేని పార్టీ ఎప్పటికీ ప్రజా మద్దతును సృష్టించదు. కొన్ని కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించడం ద్వారా బీజేపీ మనుగడ సాగిస్తున్న విలువ లేని పార్టీ" అని హకీమ్ విమర్శించారు.
ఇక ఈ ర్యాలీకి ముందు సువేందు అధికారి మమతా బెనర్జీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
