ఈ నెల్లోనే తారాస్థాయికి కరోనా సెకెండ్ వేవ్... మినీ లాక్ డౌన్: ఎయిమ్స్ చీఫ్ ఆందోళన
కరోనా సెకెండ్ వేవ్ ఈ నెలలో(ఏప్రిల్) తారాస్థాయిలో ఉండొచ్చని... అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోవిడ్-19 మేనేజిమెంట్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సూచించారు.
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంపై ఎయిమ్స్ డైరెక్టర్, కోవిడ్-19 మేనేజిమెంట్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. సెకెండ్ వేవ్ ఈ నెలలో తారాస్థాయిలో ఉండొచ్చని... అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మినీ లాక్‌డౌన్‌ల అవసరం ఉందని... ప్రజలు వీలైనంత వరకూ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.
కరోనా కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు మాస్క్‌లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించడం లేదని గులేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు.
గులేరియా ఆందోళన వ్యక్తం చేసినట్లుగానే కరోనా మహమ్మారి రెండో దశలో ర్యాపిడ్ స్పీడ్‌తో విజృంభిస్తున్నది. తాజాగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,03,558 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. ఇందులో 1,16,82,136 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,65,101 మంది బాధితులు మరణించారు. రోజువారీ కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజురోజుకు యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 7,41,830 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 52,847 మంది వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా మరో 478 మంది మరణించారని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 7,91,05,163 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.