భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ( ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 యాత్రలో రెండో ప్రక్రియ కూడా విజయవంతమైంది. భూకక్ష్యను పెంచే క్రమంలో ఇప్పటికే బుధవారం మధ్యాహ్నం మొదటి భూ కక్ష్యను పెంచగా.. శుక్రవారం తెల్లవారుజుమున 1.08 నిమిషాలకు రెండో భూకక్ష్యను సైతం పెంచారు.

దీంతో చంద్రయాన్-2 వాహకనౌక 251×56829 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్యలోకి చేరింది. చంద్రయాన్-2 వాహక నౌకలోని ఆన్‌బోర్డ్ ఇంధనాన్ని 883 సెకన్లపాటు మండించడం ద్వారా విజయవంతంగా కక్ష్యను పెంచినట్లు ఇస్రో వెల్లడించింది.

జూలై 29న మధ్యాహ్నం మూడోసారి భూకక్ష్యను పెంచే ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఆగస్టు 14 వరకు ఇలాగే భూకక్ష్యలు పెంచే ప్రక్రియలు కొనసాగనున్నాయి.