మేఘాలయలోని బొగ్గు గనిలో చిక్కుకుపోయిన కార్మికుల మరో మృతదేహం గురువారం బయటపడింది. తూర్పు జయంతియా జిల్లాలోని ఎలుక కలుగుల్లాంటి గనిలో గతేడాది డిసెంబర్ 13న కార్మికులు బొగ్గును వెలికితీస్తున్నారు.

అయితే ఒక్కసారిగా నీరు రావడంతో అక్కడ పనిచేస్తున్న 15 మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, నేవి, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

గనిలో  నీటి స్థాయి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కోల్ ఇండియయా, కిర్లోస్కర్, కేఎస్‌బీ కంపెనీలకు చెందిన సిబ్బంది గనిలోని నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో జనవరి 23న మొదటి మృతదేహాన్ని కనుగొన్నారు. అతనిని అసోంలోని చిరాగ్ ప్రాంతానికి చెందిన అమీర్ హుస్సేన్‌గా గుర్తించారు. తాజాగా గురువారం ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది అండర్ వాటర్ రిమోర్ట్ ఆపరేటెడ్ వెహికల్ సాయంతో గనిలో 200 అడుగుల లోతులో కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. ఇది ఎవరిదన్నది గుర్తించాల్సి ఉంది.