Russia Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారత వైద్య విద్యార్థులకు తగిన సాయం అందిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్ర మెడికల్ కాలేజీల్లో కౌన్సెలింగ్ తర్వాత ఇంటర్న్‌షిప్ కొనసాగించడానికి అనుమతిస్తామని చెప్పారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభించడంతో అక్కడ పరిస్థితులు దారుణంగా మారాయి. భారత్ నుంచి చదువుకోవడానికి వెళ్లిన వేలాది మంది వైద్య విద్యార్థులు తిరిగి స్వదేశానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మధ్యలోనే వైద్య విద్యను వదిలేసి వచ్చిన వారికి భారత్ లో చదువులను కొనసాగించడానికి ప్రభుత్వం ప్రత్యేక సిలబస్, పరీక్ష విధానం తీసుకురావాలనే వినతులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గుడ్ న్యూస్ చెప్పారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు సీఎం మమతా బెనర్జీ భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అలాగే, కౌన్సెలింగ్ తర్వాత ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్న్‌షిప్ కొనసాగించడానికి ఇంటర్న్‌లను అనుమతిస్తామని మమతా బెనర్జీ తెలిపారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉక్రెయిన్ నుండి తరలించబడిన 391 మంది విద్యార్థులతో మమతా బెనర్జీ సంభాషించారు.
రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులందరికీ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రయివేటు వైద్య కళాశాలల్లో వసతి కల్పిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నాడు తెలిపారు. విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ తర్వాత ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్న్‌షిప్ కొనసాగించేందుకు అనుమతిస్తామని ఆమె తెలిపారు.
అలాగే, ఇంజినీరింగ్ విద్యార్థుల ఎంపికలు, డిమాండ్లను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. వారు కెనడాకు బదిలీ చేయడానికి ఆర్థిక సహాయం కోరారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నందున ఆ కాలేజీల్లో సీట్ల కోసం ప్రభుత్వ కోటాలో చదవడానికి ఆర్థిక సహాయం చేయాలని వైద్య విద్యార్థులు రాష్ట్రాన్ని కోరారు. కోల్‌కతాలోని ప్రభుత్వ సంస్థల్లో చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కొందరు చెప్పారు. బెంగాల్‌లో ఎంతమంది చదువుకోవాలనుకుంటున్నారని మమతా బెనర్జీ అడగడంతో దాదాపు అందరూ చేతులు ఎత్తారు.
మొదటి సంవత్సరం విద్యార్థులకు తాజాగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తామని, జాతీయ వైద్య మండలి అనుమతిస్తే ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులను ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో చేర్చుకునేందుకు అనుమతించాలని కోరతామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. నాలుగు, ఐదు, ఆరో సంవత్సరాల్లోని విద్యార్థులను రాష్ట్రంలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాస్తుందని ఆమె తెలిపారు.
'మేము మా ప్రతిపాదనను ఢిల్లీలోని మెడికల్ కౌన్సిల్‌కు పంపుతున్నాము. వారు మా నిర్ణయాలను అనుమతిస్తే, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ప్రయోజనం పొందుతారు' అని మమతా బెనర్జీ అన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తన ప్రతిపాదనలను అనుమతిస్తుందని ఆశించిన ఆమె.. ' మెడికల్ కౌన్సిల్ మా ప్రతిపాదనకు ఎందుకు అభ్యంతరం చెప్పాలి? వారు అలా చేస్తే, నేను మీ అందరినీ వారి వద్దకు తీసుకువెళ్తాను' అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని పేర్కొంటూ లేఖ కూడా రాశారు.
