ఒడిశా బహనగా రైల్వే ట్రాక్ మరమ్మత్తులు: పలు రైళ్లు రద్దు
బహనగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ మరమత్తుల కారణంగా పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.
న్యూఢిల్లీ: బహనగా బజార్ స్టేషన్ వద్ద ట్రాక్ నిర్వహణ కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. ఇవాళ, రేపు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.ఇవాళ హైద్రాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, షాలిమార్-సికింద్రాబాద్, విశాఖ-షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ మేరకు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి చెప్పారు.
ఒడిశాలోని బహనగా రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల ఆరంభంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 275 మందికిపైగా మృతి చెందారు.పలువురు గాయపడ్డారు.
బహనగా రైల్వే స్టేషన్ వద్ద కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బహనగా రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్ మరమ్మత్తుల కారణంగా రెండు రోజుల పాటు ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.
బహనగా రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదానికి గల కారణాలపై సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో బహనగా రైల్వే స్టేషన్ ను సీబీఐ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఈ కారణంగా ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణకు ఆలస్యమైందని రైల్వే శాఖాధికారులు చెబుతున్నారు.
బహనగా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగిన సమయంలో సహాయక చర్యలను రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దగ్గరుండి పర్యవేక్షించిన విషయం తెలిసిందే.బహనగా రైల్వే స్టేషన్ తరహ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకుగాను రైల్వే శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.