ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న భీకర దాడిలో భారత విద్యార్థి నవీన్ శేకరప్ప గ్యానగౌడర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. నవీన్ మృతితో విషాదంలో మునిగిపోయిన ఆయన తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. దేశంలో విద్యావ్యవస్థ సరిగా లేదని.. ఎంతో చురుకైన విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు.
ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న భీకర దాడిలో భారత విద్యార్థి నవీన్ శేకరప్ప గ్యానగౌడర్ మృతిచెందాడు. కర్ణాటకలోని హవేరి జిల్లాలోని చెలగేరికి చెందిన నవీన్ ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. అయితే రష్యా దాడుల నేపథ్యంలో ఖర్కివ్‌లోని ఓ బంకర్‌లో ఉండిపోయిన నవీన్.. మంగళవారం సరుకులు కొనుగోలు చేయడానికి బయటకు వచ్చిన సమయంలో జరిగిన షెల్లింగ్‌లో మృతిచెందాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ నవీన్ కుటుంబానికి తెలియజేసింది.
వైద్య విద్యను అభ్యసించడానికి ఉక్రెయిన్ వెళ్లిన నవీన్ మృతిచెందాడనే విషయం తెలియగానే అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన భారతీయులను తీవ్రంగా కలిచివేసింది. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు నవీన్ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ.. నవీన్ తండ్రితో మాట్లాడారు. వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు.
నవీన్ మృతితో విషాదంలో మునిగిపోయిన ఆయన తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. దేశంలో విద్యావ్యవస్థ సరిగా లేదని.. ఎంతో చురుకైన విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. నవీన్ తండ్రి మాట్లాడుతూ.. ‘నా కొడుకు 10వ తరగతి చదువుతున్నప్పుడు సైన్స్‌లో చాలా ఎక్కువ మార్కులు వచ్చేవి. అప్పుడే డాక్టర్ కావాలని కలలు కన్నాడు. 10వ తరగతిలో 96 శాతం, 12వ తరగతిలో 97 శాతం మార్కులు సాధించాడు. నవీన్ చాలా తెలివైన విద్యార్థి.

అయితే దేశంలో విద్యా విధానం, కులతత్వం కారణంగా తెలివైన విద్యార్థి అయినప్పటికీ మెడిసిన్‌లో సీటు పొందలేకపోయాడు. ఇక్కడ MBBS సీటు పొందడానికి కోటి నుండి రెండు కోట్ల రూపాయల లంచం ఇవ్వాలి. క్యాపిటేషన్ లేదా డొనేషన్ ఫీజు చెల్లించాలి. నేను మన రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, కులతత్వంతో విసిగిపోయాను. అంతా ప్రైవేట్ విద్యాసంస్థల ఆధీనంలో ఉంది. బయట కేవలం కొన్ని లక్షల రూపాయల్లోనే విద్యాభ్యాసం సాధ్యమైనప్పుడు ఇక్కడ కోట్లు ఎందుకు ఖర్చు చేస్తారు..?. ఉక్రెయిన్‌లో విద్య చాలా బాగుంది. భారతదేశంతో పోలిస్తే పరికరాలు కూడా చాలా బాగున్నాయి. బోధన కూడా చాలా బాగుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక, తన స్నేహితులు, బంధువుల నుండి డబ్బు అప్పుగా తీసుకుని.. MBBS చదివేందుకు కొడుకును ఉక్రెయిన్‌కు పంపినట్టుగా నవీన్ తండ్రి చెప్పాడు.
ఉక్రెయిన్‌లో వైద్య విద్యకు డిమాండ్..
ఉక్రెయిన్‌లో MBBS విద్య ఆరు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. భారతదేశంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలతో పోల్చితే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. భారతీయ విద్యార్థులలో ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్‌ను ప్రముఖ ఎంపిక చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. ప్రైవేట్ కళాశాలల్లో తక్కువ ఫీజులు, నాణ్యమైన విద్య.. భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌ను ఎంచుకునేలా చేస్తున్నాయి. అక్కడి ప్రసిద్ధ కాలేజ్‌లు సీటును అందించడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించడం లేదు. ఇటీవల, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా విదేశాలలో మెడిసిన్ చదివే 90 శాతం మంది భారతీయులు భారతదేశంలో అర్హత పరీక్షలను క్లియర్ చేయడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు.
ఉక్రేనియన్ కళాశాలలు ప్రపంచ ఆరోగ్య మండలిచే కూడా గుర్తించబడ్డాయిజ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా వాటిని గుర్తించినందున అక్కడి డిగ్రీలు భారతదేశంలో కూడా చెల్లుతాయి. ఉక్రెనియన్ మెడికల్ డిగ్రీలు పాకిస్తాన్ మెడికల్ అండ్ డెంటల్ కౌన్సిల్, యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిసిన్, జనరల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ ద్వారా కూడా గుర్తించబడ్డాయి.
