ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో గత కొద్దిరోజులుగా జమ్మూకాశ్మీర్‌లో జన జీవనం స్థంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి.

సోమవారం నుంచి కాశ్మీర్ లోయలో పాఠశాలలు, విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము ధీటైన వ్యూహాన్ని రూపొందించి అమలు చేశామని... కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సలహాదారు కే. విజయ్ కుమార్ తెలిపారు.

సమస్యలను సృష్టించే వారిని గుర్తించి నిర్బంధంలోకి తీసుకోవడం తమకు ఎదురైన ప్రధాన సవాల్‌గా విజయ్ చెప్పారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించామని... ఉగ్రవాదంవైపు యువత వెళ్లకుండా అవగాహనా కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్రం హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గువాల వ్యూహాలతో కొద్దిరోజుల్లోనే కాశ్మీర్‌లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని విజయ్ కుమార్ తెలిపారు.