కరోనా మహమ్మారి నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో.. దాదాపు 9 నెలలు పాఠశాలలు తెరుచుకోలేదు. చాలా విద్యా సంస్థలు ఆన్ లైన్ లో పాఠాలు చెబుతున్నాయి. కాగా.. ఇక ఈ విద్యా సంవత్సరం ఇలా ముగియాల్సిందేననే భావన అందరిలోనూ మొదలైంది. కాగా.. తాజాగా.. ఈ విద్యాసంస్థల విషయంలో బిహార్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.

బీహార్‌లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా  గత 9 నెలలుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు (జనవరి4) నుంచి తెరుచుకోనున్నాయి. మొదటి దశలో 9 మొదలుకొని 12 వ తరగతి వరకూ గల విద్యార్థులకు స్కూళ్లు తెరుచుకోనున్నాయి. రెండవ దశలో 19 జనవరి నుంచి నర్సరీ మొదలుకొని 8వ తరగతి వరకూ గల విద్యార్థులకు స్కూళ్లు తెరవాలని భావిస్తున్నారు. బీహార్ లో సుమారు 8,000 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి.

ఆయా పాఠశాలల్లో మొత్తం 36 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈరోజు నుంచి రాష్ట్రంలోని సుమారు 18 లక్షల విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావచ్చు. కరోనా కట్టడి విషయంలో బీహార్ ప్రభుత్వం అనుసరిస్తున్న గైడ్‌లైన్స్‌కు లోబడి స్కూళ్లు, కాలేజీలలో సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా పాటించాల్సివుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు 50 శాతం మంది విద్యార్థులు హాజరు కావలసివుంటుంది. దీనితో పాటు స్కూళ్లు, కాలేజీలలో శానిటైజేషన్ తప్పనిసరిగా చేయాల్సివుంటుంది.