సరిగ్గా చదవడం లేదని... చెప్పినట్లు వినాలని విద్యార్ధులకు సుతిమెత్తగా చెప్పి గతంలో ఉపాధ్యాయులు అద్భుత విజయాలు సాధించేవారు. కానీ రాను రాను పరిస్ధితిలో మార్పు వస్తోంది.

ఉపాధ్యాయులు విద్యార్ధులను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు విద్యార్ధిపై గొడ్డలితో బెదిరించి భయభ్రాంతులకు గురిచేశాడు.

వివరాల్లోకి వెళితే.. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. అందులో ఓ పదేళ్ల విద్యార్ధిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా... టీచర్ పదునైన గొడ్డలిని బాలుడి మెడపై ఉంచి బెదిరిస్తున్నాడు.. నీ ప్రవర్తన మార్చుకోవాలి.. బాగా చదువుకోవాలి లేదంటే గొడ్డలితో నరుకుతానంటూ భయపెట్టాడు.

బాలుడు భయంతో గట్టిగా ఏడుస్తున్నప్పటికీ అతను వదిలిపెట్టలేదు. క్లాస్‌ రూమ్‌లోని మిగిలిన విద్యార్ధుల వైపు గొడ్డలి చూపిస్తూ.. ‘‘మీరు కళ్లు మూసుకోండి..నేను వీడిని గొడ్డలితో నరుకుతా నంటూ హెచ్చరించాడు.

ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టడంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్ మెహబూబా ముఫ్తీ సైతం స్పందించారు.

ఈ వీడియో చూడటానికే భయంకరంగా ఉంది.. ఆ బాలుడు ఎంతటి భయభ్రాంతులకు లోనయ్యాడో ఊహించుకోలేం.. నిందితులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని మెహబూబా డిమాండ్ చేశారు.