ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు  కోసం ఎదురుచూస్తున్న చిన్నారులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు కోసం ఎదురుచూస్తున్న చిన్నారులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వివరాలు.. ఆగ్రాలోని డౌకిలో గురువారం ఉదయం పిల్లలు పాఠశాల బస్సు కోసం రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఇంతలో ఆగ్రా-ఫతేహాబాద్ నుంచి దౌకి వైపు వస్తున్న కారు రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఐదుగురు చిన్నారులను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే కారు దూసుకొచ్చిన సమయంలో కొందరు చిన్నారులు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. 

ప్రమాదం జరిగిన వెంటనే గాయపడి రక్తం కారుతున్న చిన్నారులతో వారి తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగులు తీశారు. అయితే ముగ్గురు చిన్నారులు చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు. గాయపడిన మిగిలిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన చిన్నారుల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

ఇక, ఈ ప్రమాదం అనంతరం ఆగ్రహించిన స్థానికులు ఫతేహాబాద్-ఆగ్రా రహదారిని దిగ్బంధించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.