మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్ధినుల డ్రెస్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రధానోపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మచల్‌పుర ప్రభుత్వ సెకండరీ స్కూల్ లో స్కూల్ యూనిఫాం లేకుండా సాధారణ దుస్తుల్లో వచ్చిన విద్యార్ధినులపై వ్మాఖ్యలు చేసిన రాధేశ్యామ్ మాలవియాపై కేసు నమోదైంది.
భోపాల్:విద్యార్ధినుల డ్రెస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రధానోపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మచల్‌పుర ప్రభుత్వ సెకండరీ స్కూల్ లో కొందరు విద్యార్ధినులు యూనిఫాం ధరించకుండా స్కూల్ కు వచ్చారు. ఆదివారం నాడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్కూల్ డ్రెస్ ధరించకుండా సాధారణ దుస్తుల్లో విద్యార్ధినులు వచ్చారు.స్కూల్ యూనిఫాం ధరించకుండా వచ్చిన విద్యార్ధినులపై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాధేశ్యామ్ మాలవియా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
రంగుల దుస్తులు వేసుకొచ్చి పాఠశాలలోని విద్యార్థులను చెడగొడుతున్నారని వారిపై మండిపడ్డారు. సోమవారం నుండి దుస్తులు లేకుండానే స్కూల్ కు రావాలని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మనోవేదనకు గురైన విద్యార్ధినులు ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు రాధేశ్యామ్ మాలవియాపై ఫిర్యాదు చేశారు.
విద్యార్ధినుల ఫిర్యాదుపై ప్రధానోపాధ్యాయుడు రాధేశ్యామ్ మాలవియాపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా మాచపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జితేంద్ర అంజరే చెప్పారు. ఈ విషయమై బాధిత విద్యార్ధినుల నుండి స్టేట్‌మెంట్ ను సోమవారం నాడు రికార్డు చేస్తామని ఆయన చెప్పారు.
