దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు రావడం  కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని పుష్ప్ విహార్‌లోని అమృత పాఠశాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని పుష్ప్ విహార్‌లోని అమృత పాఠశాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పాఠశాల యజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పాఠశాలను ఖాళీ చేయించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను కూడా అక్కడికి తరలించారు. పాఠశాల భవనాలను తనిఖీ చేశారు. అయితే ఇప్పటివరకు అనుమానస్పదంగా ఏమీ గుర్తించలేదని అధికారులు చెబుతున్నారు. 

ఇందుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతుందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారనే వివరాలను పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. గత నెల రోజుల వ్యవధిలో ఢిల్లీలోని మథుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు రెండు సార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. గతవారం పాఠశాల ఆవరణలో బాంబు అమర్చినట్లు ఈ మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న అప్రమత్తమైన పోలీసులు స్కూల్‌ వద్దకు చేరుకున్నారు. పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సైబర్ సెక్యూరిటీ టీం సిబ్బంది పాఠశాలకు చేరుకుని కంప్యూటర్ సిస్టమ్/మెయిల్‌ను తనిఖీ చేశారు. ఈమెయిల్ గురువారం సాయంత్రం 6.17 గంటలకు అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్-ఈస్ట్) రాజేష్ డియో తెలిపారు. అయితే ఇది ఫేక్ బెదిరింపు అని పోలీసులు తేల్చారు. 

అయితే సాంకేతిక పరిశోధనలు అనంతరం బాంబు బెదిరింపు అంటూ మెయిల్ వచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఓ విద్యార్థికి చెందినదని తేలింది. అయితే ఆ విద్యార్థి ఇందులో తనకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పాడు.