ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో విమాన సేవలపై ఆంక్షలు తొలగించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ విమాన సేవలను మళ్లీ అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ను పునరుద్ధరించాలనే ఆలోచనల్లో ఉన్నట్టు వివరించాయి.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో విమాన సేవలు(Flight Services) దాదాపు అందుబాటులో లేకుండా పోయాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సేవలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేవు. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) విజృంభించడానికి పూర్వం అంతర్జాతీయ విమాన(International Flights) సేవలను మళ్లీ పునరుద్ధరించాలనే(Resume) అభిప్రాయాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అటువైపుగా అడుగులు వేసింది. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ స్వల్పకాలంలోనే ప్రపంచవ్యాప్తంగా మరో సారి ప్రమాద ఘంటికలు మోగించాయి. దీంతో అంతర్జాతీయ విమాన సేవలను అందుబాటులోకి తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. దీంతో అంతర్జాతీయ విమాన సేవలపై చర్చ మళ్లీ ముందుకు వచ్చింది.
23 నెలల నిషేధం తర్వాత అంతర్జాతీయ విమాన సేవలు మళ్లీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో అందుబాటులోకి రావొచ్చని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర వైమానిక శాఖ కేంద్ర ఆరోగ్య, హోం శాఖలతో చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చల్లోనే అంతర్జాతీయ విమాన సేవలు పునరుద్ధరించాలా? లేక నిషేధాన్ని ఎప్పటిలాగే కొనసాగించాలా? అనే నిర్ణయాన్ని తీసుకోబుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సేవలపై ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిషేధం అమలులో ఉన్నది. అయితే, వందే భారత్ మిషన్ కింద కొన్ని విమానాలు సేవలు అందిస్తున్నాయి. ఇతర దేశాలతో మన దేశం ఏర్పాటు చేసుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగానూ విమాన సేవలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందం కింద ఆ ఉభయ దేశాల మధ్య విమాన ప్రయాణికుల రాకపోకలు జరుగుతున్నాయి.
తొలిసారిగా కరోనా మహమ్మారి పడగ విప్పినప్పటి నుంచి అంటే 2020 మార్చి 23న తొలిసారి షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ఫ్లైట్ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిషేధం కొనసాగుతూనే ఉన్నది. కాగా, గతనెల మే నెలలో దేశీయ విమానాలు సేవలు అందించడం ప్రారంభించాయి. కాగా, కరోనా కేసులు ఇంకా కనిష్ట స్థాయికి చేరకపోవడంతో అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా కేసుల్లో భారీ తగ్గుదల చోటుచేసుకుని 30 వేల దిగువకు చేరాయి. మరణాలు సైతం తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తున్నది. దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టగా.. మరణాలు సైతం తగ్గాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్త నమోదైన కరోనా వైరస్ కేసులు తగ్గగా, మరణాలు తగ్గాయి. కొత్తగా 27,409 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 4,26,92,943 కు పెరిగింది. ఇదే సమయంలో 82,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 4,17,60,458 కి పెరిగింది. ప్రస్తుతం 4,23,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 347 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే మరణాలు సగానికి తగ్గాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,09,358 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.7 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.0 శాతంగా ఉంది.
