పన్నీరు సెల్వంపై అన్నాడిఎంకె తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 11న పన్నీరు సెల్వాన్ని అన్నాడిఎంకె నుండి బహిష్కరించారు. 

న్యూఢిల్లీ: పన్నీరు సెల్వంపై అన్నాడీఎంకె తీసుకొన్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. శుక్రవారం నాడు ఈ విషయమై ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. పన్నీరు సెల్వాన్ని బహిష్కరిస్తూ ఈ నెల 11న అన్నాడిఎంకె జనరల్ బాడీ సమావేశం నిర్ణయం తీసుకొంది. 

ఈ నెల 11న ఎఐడిఎంకె జనరల్ కౌన్సిల్ సమావేశంలో పన్నీరు సెల్వాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని నిర్ణయిస్తూ పన్నీరు సెల్వం తదితరులు దాఖలు చేసిన మూడు పిటిషన్లపై మూడు వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మద్రాస్ హైకోర్టును ఆదేశించింది.

పార్టీకి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని ఓపీఎస్, పళనిస్వామి నేతృత్వంలోని వర్గాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను పన్నీరు సెల్వాన్ని పార్టీ నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి ముగింపు పలికారు. అన్నాడిఎంకె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని నియమిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.మద్రాస్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.

జయలలితకు పన్నీరు సెల్వం నమ్మినబంటుగా ఉండేవారు. జయలలిత మరణించిన తర్వాత పన్నీరు సెల్వం సీఎంగా కొనసాగారు. అయితే కొంత కాలం తర్వాత జయలలిత సన్నిహితురాలు శశికళ పార్టీని తన హస్తగతం చేసుకొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పన్నీరు సెల్వం సీఎం బాధ్యతల నుండి తప్పించారు. పళని స్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా శశికళ భాద్యతలు తీసుకోవాలని భావించిన సమయంలో కేసు రూపంలో ఆమెను దురదృష్టం వెంటాడింది. ఈ సమయంలో పన్నీరు, పళనిస్వామి వర్గాలు కలిసిపోయారు

. ఈ రెండు వర్గాలు కలిసి శశికళను పార్టీ నుండి తప్పించారు. పళనిస్వామికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. సీఎంగా పళినస్వామి కొనసాగారు. పార్టీలో ద్వంద్వ నాయకత్వం విషయమై పార్టీ నిబంధనలో మార్పులు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓటమి పాలైంది. ఈ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమికి పన్నీరు సెల్వంపై పళనిస్వామి వర్గం ఆరోపణలు చేసింది. దీంతో ఇరు వర్గాలు పార్టీపై పట్టుకు ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో ఈ నెల 11న నిర్వహించిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొంది. పన్నీరు సెల్వాన్ని పార్టీ నుండి బహిష్కరించింది.