న్యూఢిల్లీ: కరోనా మహామ్మారి విజృంభిస్తున్న సమయంలో  ప్రేక్షకపాత్ర పోషించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా కేసులు, చికిత్స విషయమై ఆయా రాష్ట్రాల్లో దాఖలైన పిటిషన్లతో పాటు  ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొంది. ఇందులో భాగంగానే  ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు  మంగళవారంనాడు చేపట్టింది.

రాష్ట్రాల మధ్య జరుగుతున్న సహకారాలను సమన్వయపర్చడంలో తమ పాత్ర ఉంటుందని సుప్రీం తెలిపింది. కరోనా ను ఎదుర్కొనేందుకు దేశం మొత్తం పోరాటం చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టు జోక్యం అవసరమని తెలిపింది. జాతీయ సంక్షోభం సమయంలో స్పందించకుండా ఉండలేమని అత్యున్నతన్యాయస్థానం అభిప్రాయపడింది. 

ఆయా రాష్ట్ర హైకోర్టుల్లో కరోనా కేసులపై సాగుతున్న విచారణను ఆపబోమని కోర్టు తెలిపింది. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి హైకోర్టులే సరైన నిర్ణయం తీసుకొనేందుకు వీలు కలుగుతోందన్నారు. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, రవీంద్ర భాట్,  డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. గతవారంలోనే ఈ విషయమై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొంది.ఈ కేసు విచారణను  సుప్రీంకోర్టు  చేపట్టింది.