న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి  సుప్రీంకోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లులను రాజ్యసభలో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభలో ఈ బిల్లుల ఓటింగ్ సమయంలో విపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్, ఛత్తీస్‌ఘడ్ కిసాన్ కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 

వీటిపై విచారణకు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. భారత ప్రధాన నాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

స్వేచ్ఛాయుత మార్కెట్ చట్టం, ఒప్పంద వ్యవసాయ చట్టం, నిత్యావసర వస్తువుల సవరణ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. ఈ చట్టాలు రైతుల నడ్డివిరుస్తున్నాయని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఆరు వారాల్లోగా  కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ను కోరింది.