Supreme court ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ కు వార్నింగ్: వారం రోజుల్లో ఆర్ఆర్‌టీఎస్ కు నిధులు ఇవ్వాలని ఆదేశం
ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ఆర్‌టీఎస్ నిధుల విషయమై ఇవాళ జరిగిన విచారణలో ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
న్యూఢిల్లీ: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ)కి ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టు కోసం నిధులు విడుదల చేయకపోవడంపై ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
జాతీయ ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు చేయకుండా ఇతర అంశాలకు డబ్బులు మళ్లిస్తే ఎలాంటి ప్రయోజమని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అడ్వర్‌టైజ్ మెంట్ల కోసం మళ్లించిన డబ్బును మౌళిక సదుపాయాల కల్పన కోసం మళ్లించాలని తాము అడిగేందుకు వెనుకాడబోమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.అడ్వర్ టైజ్ మెంట్ల కోసం ఉద్దేశించిన నిధులను ప్రాజెక్టు కోసం బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే వారం రోజుల లోపుగా నిధులను బదిలీ చేయకపోతే ఈ ఆర్డర్ అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకపరిణామం: విచారణకు హాజరు కాలేనని ఈడీకి కేజ్రీవాల్ లేఖ
ఈ ఏడాది జూలై మాసంలో ఢిల్లీ మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ బకాయిలను చెల్లించేందుకు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కు సుప్రీంకోర్టు రెండు మాసాల గడువు ఇచ్చింది.తాము ఆదేశాలిచ్చినా కూడ రెండు మాసాల్లో ఈ నిధులను ఎందుకు ఇవ్వలేదని సుప్రీంకోర్టు కేజ్రీవాల్ సర్కార్ ను ప్రశ్నించింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనల బడ్జెట్ ను ఈ ప్రాజెక్టుకు బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులు చేస్తామని ఆమ్ ఆద్మీ నేతృత్వంలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సుప్రీంకోర్టుకు ఇవాళ హామీ ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు తమ ఆదేశాలను నిలుపుదల చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వారం రోజుల్లో నిధులను బదిలీ చేయకపోతే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.ఈ విషయంలో వెనక్కు వెళ్లవద్దని ఢిల్లీ సర్కార్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టును గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు మూడేళ్ల బడ్జెట్ రూ.1,100 కోట్లు. అయితే ఈ ఏడాది రూ. 550 కోట్లు ఢిల్లీ సర్కార్ చెల్లించాల్సి ఉంది.