Asianet News TeluguAsianet News Telugu

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం.. అన్ని విచారణలను రద్దు చేస్తూ...

బాబ్రీ కూల్చివేతకు సంబంధించిన అన్ని కేసుల విచారణను సుప్రీంకోర్టు ముగించింది. అంతే కాకుండా దానికి సంబంధించిన అన్ని ధిక్కార పిటిషన్లను మూసివేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.

SC closes all cases, petitions against 1992 Babri Masjid demolition
Author
First Published Aug 30, 2022, 2:26 PM IST

బాబ్రీ కట్టడం కూల్చివేతకు సంబంధించిన అన్ని విచారణలను మూసివేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో పాటు ఈ అంశంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇతర అధికారులపై దాఖలైన అన్ని దాఖలైన ధిక్కార పిటిషన్‌ను కూడా మూసివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సుప్రీంకోర్టు 2019 తీర్పును దృష్టిలో ఉంచుకుని.. ధిక్కార పిటిషన్‌ను సమర్థించడం లేదని, ధిక్కార పిటిషన్‌ను ముందే లిస్ట్ చేసి ఉండాల్సిందని సుప్రీంకోర్టు పేర్కొంది. 

ఈ అంశంపై విచారణ ఇకపై సరైనది కాదని కోర్టు అభిప్రాయప‌డింది. విచారణ సందర్భంగా.. పిటిషనర్ ముహమ్మద్ అస్లాం భూరే ఇప్పుడు ఈ లోకంలో లేరని, కాబట్టి ఈ కేసును ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి యూపీ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్, తదితరులపై దాఖలైన ధిక్కార కేసును సుప్రింకోర్టు ముగించింది.

ఈ కేసులో ప్ర‌ధాన పిటిషనర్ ముహమ్మద్ అస్లాం భూరే..ఆయ‌న 1991లో బాబ్రీ కూల్చివేత‌కు వ్య‌తిరేకంగా తొలి పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఆయన 1992లో కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ విచారణ సుధీర్ఘ కాలం పాటు సాగింది. అయితే, అతను 2010లో మరణించాడు. 

అదే సమయంలో పిటిషనర్ మరణాన్ని ఉదహరిస్తూ.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో యుపి మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌పై కోర్టు ధిక్కారానికి సంబంధించిన కేసును కూడా సుప్రీంకోర్టు ముగించింది. చాలా సమయం గడిచిపోయిందని కోర్టు పేర్కొంది. అయోధ్య తీర్పు 2019లో వచ్చింది. ఈ దృష్ట్యా, ఇప్పుడు దాఖాలైన‌ పిటిషన్‌ను సమర్థించలేమ‌ని కోర్టు పేర్కొంది.

విశేషమేమిటంటే.. 

6 డిసెంబర్ 1992న బాబ్రీ మసీదు వద్ద ల‌క్షలాది మంది కరసేవకులతో ఒక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులు బాబ్రీ మసీదులోకి చొరబడి దానిని కూల్చివేశారు. ఈ హింసాత్మ‌క‌  సంఘటనలో ఎల్కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి బీజేపీ నేతలతో సహా 68 మందిపై కేసులు న‌మోదయ్యాయి. అంత‌టితో ఈ వివాదం ఆగిపోలేదు.

దేశంలో మత ఘర్షణలకు బాబ్రీ మసీదు కూల్చివేత ఆజ్యం పోసింది. దేశ‌వ్యాప్తంగా హిందూ, ముస్లింల‌ మధ్య ఘ‌ర్షణ‌లు జ‌రిగాయి. ఈ మ‌త ఘర్షణల్లో దాదాపు  రెండు వేల‌ మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో కూడా మ‌త ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. 

బాబ్రీ కూల్చివేతకు హిందూ మ‌త సంస్థ‌లైన ఆర్‌ఎస్ఎస్, వీహెచ్‌పీ అగ్రనేతలు ప్లాన్ చేశారనీ, కావాల‌నే 
మ‌సీద్ ద‌గ్గ‌ర నిర‌సన ప్ర‌ద‌ర్శ‌లు చేప‌ట్టార‌ని అప్ప‌టి  ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి మలోయ్ కృష్ణ‌ధర్ ఆరోపించారు. 
 
ఇక, 2019లో అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు కీల‌క తీర్పును వెలువ‌రించింది. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని, అదే సమయంలో అయోధ్యలో వేరే ప్రదేశంలో ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు 5 ఎకరాల భూమిని అందించాల‌ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. దీంతో ద‌శాబ్దాలుగా కొన‌సాగిన వివాదం అంత‌టితో సమసిపోయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios